
చీరాల: ఎప్పుడు ఏ బజారులో హత్య జరుగుతుందో.. ఎప్పుడు ఏ ఇల్లు లూటీకి గురవుతుందో.. ఏ క్షణాన మహిళ అత్యాచారానికి గురవుతుందో.. ఏ రోడ్డు వెంట దోపిడీ దొంగలు ఎప్పుడు పైన పడతారో! క్షణం క్షణం భయం..భయం. ఇదీ చీరాల సబ్ డివిజన్‌లో నేటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ఎవరికీ అంతుబట్టడంలేదు.
నిందితుల జాడ లేదు..
చీరాల్లో జరుగుతున్న నేరాలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో శవనం లక్ష్మీ తేజని గోపిచంద్ అనేవ్యక్తి గొంతుకోసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఇప్పటికి నిందితుణ్ణి కానీ.. అందుకు సహకరించిన వారిని కానీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అలానే అధికార పార్టీకి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు శ్రీహరి నివాసంలో దొంగలుపడి ఇంటి తాళం పగులకొట్టి సుమారు రూ. 70 లక్షలు విలువైన నగలు, నగదు, వెండిని అపహరించినా రికవరీలో అడుగు ముందుకు పడలేదు.
ఆరు నెలల వ్యవధిలో మూడు హత్యలు..
గడచిన మూడు నెలల్లో చీరాల నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి. మూడు నెలల క్రితం రౌడీ షీటర్ కత్తి శ్రీను సైకిల్‌పై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా గతం తాలూకు కక్షలు నేపథ్యంలో పాత ప్రసాద్ థియేటర్ సమీపంలోని బోసు నగర్‌లో అతని బంధువులు క్రికెట్ బ్యాట్లతో తలపై మోది హతమార్చారు.
వేటపాలెం మండలంలోని బచ్చులవారిపాలెంలోని పెరుగు శ్రీనివాసరావుకు చెందిన రొయ్యల చెరువులకు గుంటూరు జిల్లాకు చెందిన రాజు పోతురాజు రెడ్డి అతని భార్య రొయ్యల కాపలా ఉంటున్నారు. ఈ క్రమంలో పోతురాజు రెడ్డి భార్యతో చెరువుల యజమాని వివాహేతర సంంధం నెరపుతున్నాడు. ఈ విషయం పోతురాజు రెడ్డికి తెలిసి భార్యను మందలించాడు. ఇది శ్రీనివాసరావు తెలియడంతో పోతురాజు రెడ్డిని మరోవ్యక్తి సాయంతో కలిసి నెల రోజుల క్రితం కొట్టి చంపేశారు.
వారం రోజుల క్రితం వేటపాలెం మండలం పాత పందిళ్లపల్లికి చెందిన రొయ్యల సాగుచేసే తిరుమల శ్రీహరిని.. అతని బావ ఆర్థిక లావాదేవీల కారణంగా అత్యంత పాశవికంగా హత్యచేసి తన ఇంట్లోనే పూడ్చివేశాడు.
పోలీస్ స్టేషన్ ఉన్నా లెక్కలేదు..
ఇటీవల కాలంలో దొంగలు వరుస చోరీలకు తెగబడుతున్నారు. పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని షాపులు, మద్యం దుకాణాలను కూడా వదిలిపెట్టడంలేదు. ఇటీవల ఓ బనియన్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దూరిన దొంగలు విలువైన బట్టలు, కొంత నగదును అపహరించారు. అలానే డీజీకే పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి మద్యం బాటిళ్లతో పాటు 50 వేలకు పైగా నగదును అపహరించారు. సాల్మన్ సెంటర్‌కు చెందిన ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 20 సవర్లు బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, కొంత నగదును అపహరించారు.
సబ్ డివిజన్ పరిధిలో...
పట్టణమే కాకుండా చీరాల సబ్ డివిజన్ పరిధిలో కూడా నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇటీవల మార్టూరు పోలీసు స్టేషన్‌లో ఆదిలాబాద్‌కు చెందిన విజయ్ రాధోడ్ లాకప్ డెత్‌కు గురయ్యాడు. బొల్లాపల్లి పెట్రోలు బంకు సమీపంలో విధి నిర్వహణలో ఉన్న మార్టూరు ఎస్సై నాగ మల్లేశ్వరరావుపై ఓ దొంగల ముఠా దాడిచేసింది. అలానే జూలై 18న కొమరనేని వారిపాలెంలో 60 సవర్లు బంగారం, రెండు కేజీల వెండి, రెండు లక్షల నగదును అపహరించారు.
జూదం జోరు
బడుగు, బలహీన వర్గాలు అధికంగా జీవించే చీరాలలో.. చేనేతలు అధికంగా నివసించే జాండ్రపేట, దేశాయిపేట, ఈపూరుపాలెం, పేరాల ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల అధారంగా జరిగే జూదంలో చేనేత కార్మికులు, చిన్నచిన్న పనులు చేసుకుని బతికేవారు అప్పుల పాలవుతున్నారు. ఇటీవల వరసగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ పోటీల సందర్భంగా చీరాలలో బెట్టింగ్ జోరుగా సాగింది. . విద్యార్థులే దీనిలో బాధితులవుతున్నారు. బెట్టింగ్‌ల కారణంగా ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సిబ్బంది కొరత
చీరాల సబ్ డివిజన్‌లో శాంతి భద్రతలు తప్పుతుండగా మరోవైపు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిత్యం అమరావతిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌తో పాటు కిర్లంపూడి వంటి ప్రాంతాలకు కూడా వెళ్లి విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఉదయం నుంచి స్టేషన్లలో విధులు నిర్వర్తించే ఎస్సైలను ప్రతిరోజూ రాత్రి హైవే పెట్రోలింగ్ అంటూ మార్టూరు ప్రాంతానికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులంతా జిల్లా ఎస్పీ బూసరపు సత్య ఏసుబాబు తీసుకొనే చర్యలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సస్పెన్షన్‌ల పర్వం
బచ్చులవారిపాలెంలో జరిగిన ఓ హత్య కేసులో కేసు నమోదు చేయకుండా ఓ ఎస్సై, సీఐ శాఖాపరమైన విచారణ ఎదుర్కొని సస్పెండయ్యారు. వాడరేవులో పోలీసు అతిథి గృహం పేరుతో లక్షల రూపాయల నిధులు సేకరించిన సీఐ స్థాయి అధికారి, సీసీ కెమెరాల ఏర్పాటు కంటూ భారీగా నిధులు సేకరించిన సీనియర్ సీఐ, కొత్తపేటలోని టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఓ మహిళను అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చిన విషయంలో ఎస్సై, సీఐ సస్పెండ్‌కు గురయ్యారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సుపారీ సంస్కృతి
ఇదిలా ఉంటే చీరాలలో కిరాయి హంతక ముఠాలు ఏర్పడ్డాయి. సుపారీలు తీసుకోవడం మొదలెట్టారు. చెన్నంబొట్ల అగ్రహరంలో ట్రిపుల్ మర్డర్ నిందితునులను హత మార్చేందుకు సుపారీ తీసుకుని వాటిని పంచుకునే విషయంలో విభేదాలు ఏర్పడటతో ముఠా సభ్యులే ఒకరినొకరు హత మార్చుకునేందుకు సిద్ధమై చివరకు పోలీసులకు చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment