► నిందితుడిని తరలిస్తుండగా ఘటన
► నలుగురికి తీవ్ర గాయాలు
తిరుత్తణి: మహిళ కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుడిని అరక్కోణంలో అరెస్టు చేసి ఆంధ్రా పోలీసులు తరలిస్తుండగా అడ్డుకున్న ఓ రౌడీ ముఠా వారిపై దాడి చేసి నిందితుడిని తీసుకెళ్లిన సంఘటన తిరుత్తణిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు 2009లో ఓ మహిళ కిడ్నాప్ కేసుకు సంబంధించి మదన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి గత వారం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మదన్‌రెడ్డి తమిళనాడు అరక్కోణం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ శ్యాంసన్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, వెంకటేష్, గజవాల శనివారం అరక్కోణం చేరుకుని మదన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం కారును అద్దెకు తీసుకుని నిందితుడితో పాటు పోలీసులు ప్రయాణం అయ్యారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో తిరుత్తణి సమీప చెన్నై, తిరుపతి జాతీయ రహదారి వద్ద కారు వెళ్తున్న సమయంలో అడ్డుకున్న కొంతమంది కారు అద్దాలను ధ్వంసం చేసి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కారులోని మదన్‌రెడ్డిని తీసుకుని పారిపోయారు. గాయపడిన పోలీసులను స్థానికకులు తిరుత్తణి జీహెచ్‌కు తరలించారు. దీనిపై ఆంధ్రా పోలీసులు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రా పోలీసులపై రౌడీ ముఠా దాడి
Published Sun, Apr 23 2017 7:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement