
డబ్బే ధ్యేయం..ప్రేమికులే లక్ష్యం
చిత్తూరు (క్రైమ్): జిల్లాలో కరుడుగట్టిన నేరగాళ్లు ప్రేమికులపై పంజా విసురుతున్నారు. ఏడెనిమిదేళ్లలో 200కు పైగా సంఘటనలు జరగగా పోలీసు రికార్డుల్లో 80 మాత్రమే నమోదయ్యాయి.
ఇప్పటివరకు చోటు చేసుకున్న ఘటనలు
చిత్తూరుకు చెందిన తుకారామ్ శాడిస్ట్. చిత్తూరు, పలమనేరు అటవీ ప్రాంతాల పరిధిలో 2007 నుంచి 2009 వరకు ప్రేమజంటలను కత్తి చూపించి బెదిరించాడు. డబ్బు, బంగారం గుంజుకుని అందం గా ఉన్న అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో ఓ జంట చిత్తూరు అటవీ ప్రాంతం వద్ద మాట్లాడుతుండగా వారిపై దాడి చేశాడు. ప్రియుడిని తాళ్లతో బంధించి, ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. చిత్తూరు ఫారెస్ట్, బెరైడ్డిపల్లె మండల పరిధిలోని కైగల్ జలపాతం వద్ద ఇలాంటి ఘటనలు అతని కి లెక్కే లేదు. ఆపై అతను తన స్టైల్ మార్చాడు. కత్తులు కాదని తుపాకీని చేతబట్టాడు. 2009లో కైగల్ జలపాతం వద్ద ప్రేమజంటపై దాడి చేశాడు. ప్రియుడిని చితకబాది ప్రియురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రియుడు ప్రతిఘటించడంతో తుకారామ్ ఆగ్రహించి కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియురాలు తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. ఘటనా స్థలం వద్ద బుల్లెట్ల పైకప్పులు దొరికినా పోలీసులు సకాలంలో నిందితుడిని పట్టుకోలేకపోయారు. చిత్తూరు అటవీ ప్రాంతంలో జరిగిన సంఘటనలో తుకారామ్‌ని గుర్తుపెట్టుకున్న ప్రియుడు అతని కోసం ఆరు నెలల పాటు గాలించాడు. ఆఖరికి తుకారామ్‌ను చిత్తూరులోనే పట్టుకుని చితకబాదాడు. ప్రస్తుతం తుకారాం కడప జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2009లోనే కేజీఎఫ్ పరిసర ప్రాంతాలకు చెందిన మరో శాడిస్ట్ శ్రీనివాస్, అతని అనుచరులు అన్నయప్ప, హనుమప్పతో పాటు మొత్తం ఐదుగురు ఓ బ్యాచ్‌గా ఏర్పడ్డారు. ఇదే తరహాలో ప్రేమికులపై దాడులు చేసి భయపెట్టడం మొదలుపెట్టారు.
వీరిపై పలమనేరు పరిసర ప్రాంతాల్లో పది, కర్ణాటకలో 20 కేసులు ఉన్నాయి. వీరు రెండేళ్లపాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. ఆఖరికి బ్యాచ్ లీడర్ శ్రీనివాస్ అనారోగ్యంతో మృతిచెందగా, మిగి లిన వారు కర్ణాటక జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
జగమర్ల ఫారెస్ట్‌లో లాల్‌సింగ్
లాల్‌సింగ్ చిత్తూరులో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశాడు. నిబంధనలు అతిక్రమించడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. 2005 నుంచి 2012 వరకు జగమర్ల, బూతలబండ, గాంధీనగర్ అటవీ ప్రాంతాల్లో ప్రేమికుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఎవరైనా అటవీ ప్రాంతంలో కనిపిస్తే పోలీస్‌నంటూ బెదిరించేవాడు. స్టేషన్ వరకు వస్తే ప్రేమ బండారం బయటపడుతుందనే భయంతో ప్రేమికులు ఉన్న డబ్బు, నగలు అతని చేతిలో పెట్టేవారు. ఇలా లాల్‌సింగ్ పలుమార్లు ప్రేమికులపై దాడి చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆపై బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే బాట పట్టడం అతనికి అలవాటైంది. 2012లో మదనపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
2012 నుంచి సేలం బ్యాచ్
2012 నుంచి సేలం బ్యాచ్ రంగంలోకి దిగింది. పలమనేరు సమీపంలోని గాంధీనగర్, జగమర్ల, బూతలబండ అటవీ ప్రాంతాలు, భాకరాపేట, బోయకొండ, పెనుమూరు, కాణిపాకం, చంద్రగిరి, తలకోన తదితర అటవీ ప్రాంతాలను ఎంచుకున్నా రు. సంతలు, పండుగ దినాల్లో పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాల వద్ద మకాం వేశారు. దంపతు లు, జంటలపై అదునుచూసి దాడి చేస్తున్నారు. ఇందులో సేలం జిల్లా సంగగిరి ప్రాంతానికి మణికంఠ అలియాస్ సంపత్ (29) ముఖ్యుడు. కొంత మందిని వెంటబెట్టుకుని జంటలను బెదిరించేవాడు. కళ్లలో కారంపొడి చల్లి మహిళలపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. అడ్డొచ్చిన వారిని హతమార్చడం రివాజుగా మారింది. ఇలా ప్రేమికులను వేటాడబోయిన కానిస్టేబుల్, హోంగార్డ్‌ను నరికి చంపారు.
ప్రత్యేక దృష్టి సారించాం
పర్యాటక కేంద్రాలు, అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఇప్పటివరకు జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. జగమర్ల ఫారెస్ట్, బోయకొండ, తలకోన, కాణిపాకం ప్రాంతాలతో పాటు రిమోట్ ఏరియాల్లో మొబైల్ పోలీసింగ్‌ను ఏర్పాటు చేశాం. పట్టుబడిన ప్రేమజంటలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
- పీహెచ్‌డీ.రామకృష్ణ, ఎస్పీ