ప్రతి రైతుకూ పంట రుణం ఇవ్వాలి
Published Thu, Sep 19 2013 1:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: గత ఏడాది వరకు అనావృష్టితో పంటలు పండక నష్టాలు మూటగట్టుకున్న రైతులు ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఊరట చెందుతున్నారని, ఈ సమయంలో రైతులందరికీ సకాలంలో పంట రుణాలను ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు తీర్చాలని ఎంపీ ఎస్పీవెరైడి , కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి బ్యాంకర్లను కోరారు. బుధవారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బ్యాంకులు సేవాభావంతో పని చేయాలని, రైతులకు ఇచ్చే పంట రుణాల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఎంపీ కోరారు. ఖరీఫ్ సీజన్ ముగియవస్తున్నా పంట రుణాల పంపిణీ అంతంతమాత్రంగా ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో రూ.1713 కోట్లు రుణాలుగా పంపిణీ చేయాల్సి ఉన్నా రూ.1504 కోట్లు మాత్రమే పంపిణీ చేయడానికి కారణాలపై ఆరా తీశా రు. ఇందుకు పలువురు బ్యాంకర్లు స్పందిస్తూ సమైక్య ఉద్యమం కారణంగా బ్యాంకులు సరిగా పనిచేయక లక్ష్యాలు సాధించలేకపోయామని వివరించారు. ఈనెల చివరిలోగా పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ వారికి సూచించారు.
కౌలుదారులను విస్మరించొద్దు..
రుణ అర్హత కార్డులు పంపిణీ చేసిన కౌలుదారులను కూడా విస్మరించకుండా రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కోరారు. గత ఏడాది వరకు కౌలు రైతులకు అంతంతమాత్రంగానే రుణాలు ఇచ్చామని, ఈసారి పెద్ద ఎత్తున ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కింద నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకులు చొరవ తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో బ్యాంకర్ల కమిటీ లబ్ధిదారుల ఎంపిక చేపట్టిందని, ఇందుకు అనుగుణంగా రుణం మంజూరు లెటర్లు ఇచ్చి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని వివరించారు. స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం మేరకు లింకేజీ రుణాలివ్వాలన్నారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చే పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రుణ అర్హత కార్డులను కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో ఏజేసీ రామస్వామి, జేడీఏ ఠాగూర్‌నాయక్, డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్, ఎల్‌డీఎం అండవార్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement