సోమశిల, న్యూస్‌లైన్ : సాగునీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనకు గురైన ఓ కౌలు రైతు గుండె ఆగిపోయింది. పొలంలో పనిచేస్తున్న సమయంలో ఆందోళనకు గురైన ఆ రైతు విశ్రాంతి కోసం చెట్టు కిందకు చేరి అక్కడే ప్రాణం విడిచాడు. ఈ సంఘటన అనంతసాగరం మండలం బొమ్మవరం పంచాయతీ అగ్రహారంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం మేరకు..అగ్రహారానికే చెందిన ధనిరెడ్డి రామసుబ్బారెడ్డి(43) ఐదెకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. 3 ఎకరాల్లో మిరపతోట, రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ పంటలకు నీరు అందించేందుకు రామసుబ్బారెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ వైపు బోర్లలో నీరు అడుగంటడం, మరోవైపు మరోవైపు విద్యుత్ కోతలతో నీరు పారించడం కష్టమైపోయింది. బోరులో ఐదు రోజులకోసారి కూడా అర ఇంచి నీళ్లు రాని పరిస్థితి నెలకొంది.
పంట చేతికొచ్చే దశలో నీరు లేక పత్తి ఎండిపోయింది. మిరపకాయలు పిందె దశలో ఉండగానే చెట్లు ఎండిపో యాయి. ఈ క్రమంలో ఉన్న అరకొర కాయలను కోసేందుకు ఆదివారం ఉదయం భార్య సుబ్బమ్మ, కూలీలతో కలిసి తోటలోకి వెళ్లాడు. కళ్ల ముందే నిలువునా ఎండిపోయిన చెట్లను చూసి ఆందోళనకు గురయ్యాడు. కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటూ వెళ్లి చెట్టు కింద పనుకున్నాడు. రామసుబ్బారెడ్డి ఎంత సేపటికీ రాకపోవడంతో సుబ్బమ్మ వెళ్లి లేపేందుకు ప్రయత్నించగా స్పందన కరువైంది. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆందోళనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామసుబ్బారెడ్డి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యమే..
రామసుబ్బారెడ్డికి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు అక్కలరెడ్డి అంకిరెడ్డి పేర్కొన్నాడు. నీళ్లు లేక రైతుల పడుతున్న కష్టాలను రెండు నెలల క్రితమే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
పంట ఎండింది..రైతు గుండె ఆగింది
Published Mon, Feb 10 2014 3:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement