
సాక్షి, అమరావతి : ఆర్థిక మోసాలకు పాల్పడే వారికి సకాలంలో శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రిజర్వు బ్యాంకుకు సంబంధించి 17వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మోసాలకు పాల్పడే నకిలీ చిట్‌పండ్ కంపెనీలు, ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలపై సకాలంలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక మోసాలను ఆరికట్టేందుకు సంబంధిత కేంద్ర, రాష్ట్ర విభాగాలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అలాగే వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్ కంపెనీల్లో ప్రజలు పొదుపు చేసే సొమ్ముకు భరోసాగా నిలబడాలని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే రీతిలో వివిధ ఆర్థిక సంస్థలు జారీ చేసే ప్రకటనలను నిరంతరం పరిశీలించడంతోపాటు.. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో రిజర్వు బ్యాంకు రీజనల్ డైరెక్టర్ సుభ్రతా దాస్, ఆర్థిక, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ ఎస్ రావత్, కిశోర్, కేంద్ర రాష్ట ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment