‘చీట్’ఫండ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల ఆర్థిక ఇబ్బందులే పెట్టుబడిగా నకిలీ చిట్‌ఫండ్ కంపెనీలు యథేచ్ఛగా చలామణి అవుతున్నాయి. కోట్లాది రూపాయలు చేరగానే చీట్ఫండ్ కంపెనీలుగా మారిపోయి బోర్డు తిప్పేస్తున్నాయి. రాష్ట్రంలో వేలాది చిట్‌ఫండ్ కంపెనీలు రిజిస్ట్రార్ కార్యాలయంలో సంస్థను రిజిస్టరు చేయకుండానే ప్రజలు చీట్ చేస్తున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో మోసపోతున్న ప్రజలు బావురుమంటున్నారు. ఏడాదికి సగటున రూ.100 కోట్లకు పైగా ఖాతాదారుల సొమ్ము మోసగాళ్ల జేబుల్లోకి చేరుతుండగా బాధితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది.
చిట్‌ఫండ్ సంస్థలు, చీటీ పాటలు నిర్వహించే సంస్థలు ముందుగా రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అనుమతి రావాలంటే చీటిపాటల నగదు మొత్తాన్ని, చీటి పాటలు ముగిసే కాలంనాటికి సమకూరే మొత్తాన్ని ముందుగానే బ్యాంకులో డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు వారు ఇచ్చే డిపాజిట్టు డాక్యుమెంటును రిజిస్ట్రార్ కార్యాలయంలో అందజేయాలి. అనుమతులు పొందిన అనంతరం రూ.5 వేల నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు చీటిపాటలు నడపవచ్చు. ఈ నిబంధనలు మీరితే ఆ సంస్థలన్నింటినీ చట్టవిరుద్ధంగా నడిచే నకిలీ సంస్థలుగా పరిగణిస్తారు. రిజిస్టరు చేయకుండా నడిచే సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కును అధికారులు కలిగి ఉంటారు.
ఇన్ని అధికారాలు ఉండికూడా నకిలీ చిట్‌ఫండ్ సంస్థలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. అటువంటి సంస్థలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా అధికారులు సైతం మౌనం పాటిస్తున్నారు. ఏడాది కాలంలో కోట్లాది రూపాయల లావాదేవీలను సాగిస్తూ కడుపు నిండగానే సంస్థను చుట్టేస్తున్నారు. ఈ మోసంతో తల్లడిల్లిపోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భర్తకు తెలియకుండా నకిలీ సంస్థలతో లావాదేవీలు నడిపి డబ్బును పోగొట్టుకున్న భార్యల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. భార్యా భర్తల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల అండదండలు అధికంగా ఉండటం వల్లనే నకిలీ సంస్థలు ఇంతటి తీవ్రస్థాయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ నేరాలపై ఒక సామాజిక సేవా కార్యకర్త మాట్లాడుతూ, సంస్థలను రిజిస్టరు చేసుకోకుండానే కార్యకలాపాలు నిర్వహించే చిట్‌ఫండ్ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. ఈ సంస్థలు సాధారణ చీటి పాటలు, ఫలహార చీటీపాటలు, దీపావళి చీటిపాటలు, పొంగల్ చీటిపాటలు ఇలా సీజన్‌కు అనుగుణంగా రకరకాల చీటీ పాటలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు తమకున్న చిన్నపాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపుచేసే ఉద్దేశంతో ఈ సంస్థల్లో చేరుతున్నారని చెప్పారు. ఖాతాదారుల సంఖ్య పెరిగిపోయి భారీ మొత్తంలో డబ్బు జమకాగానే నకిలీ సంస్థలు బోర్డు తిప్పేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి జిల్లాల్లోనూ ఏడాదికి కనీసం వంద కేసులు నమోదవుతున్నట్లు ఆయన అన్నారు. ఈ ఆర్థిక నేరాలను విచారించే పోలీసులు నకిలీ సంస్థల యజమానుల నుంచి మామూళ్లు పుచ్చుకుని కేసు విచార ణ సాగదీస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కొన్ని కేసుల్లో మోసగాళ్ల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు గట్టిగా ఉన్నా ఆయా సంస్థలను గుర్తించడంలో రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సహాయ నిరాకరణ సాగిస్తున్నారు.
నిఘా లోపం
రిజిస్ట్రారు కార్యాలయ అధికారి మాట్లాడుతూ, 1982 చిట్‌ఫండ్ సంస్థల చట్టం ప్రకారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సంస్థలను రిజిస్టరు చేసుకోవాలని చెప్పారు. గత ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో 2,260 చిట్‌ఫండ్ సంస్థలు నమోదు కాగా, పదివేలకు పైగా సంస్థలు చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని అంగీకరించారు. చిట్ ఫండ్ సంస్థల కార్యకలాపాలపై కన్నేసేందుకు శాశ్వతంగా ఒక బందాన్ని నియమించాల్సి ఉందని, అయితే సిబ్బంది కొరత, మరికొన్ని కారణాల వల్ల గత కొంతకాలంగా తనిఖీలను నిర్వహించడం లేదన్నారు. చిట్‌ఫండ్ సంస్థలన్నీ అనుమతులు పొందివుంటాయని ప్రజలు నమ్మి మోసపోవడం అంతులేని కథగా మారిందన్నారు.