జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం రైతులకు వేదన మిగుల్చుతోంది. వర్షాలు కురుస్తాయనే ఆశతో పంటలు సాగు చేశారు. అయితే వరుణుడు కరుణించలేదు. డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 199 మిల్లీమీటర్లకు గాను కేవలం 6.4 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. దీన్ని బట్టి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వరి, పొగాకు, వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటలు ఎండుముఖం పట్టాయి. పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో రైతులకు దిక్కుతోచడం లేదు.
సాక్షి, నెల్లూరు : వరుణుడినే నమ్ముకుని పంటల సాగు చేసిన మెట్ట రైతాంగానికి కష్టనష్టాలు తప్పేట్టు లేవు. వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు పెద్దఎత్తున వరి, పొగాకు, పచ్చశనగ, వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేశారు. ముఖ్యంగా చెరువులు, బోరుబావుల కింద వరి పంటను సాగు చేశారు. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. పెట్టుబడులకు అప్పులు చేశామని, వాటిని ఎలా తీర్చాలో తెలియక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి తదితర మెట్ల ప్రాంతాల్లో రైతులు వరుణుడిని నమ్ముకొని పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. ముఖ్యంగా మెట్టప్రాంతాల్లోని 26 మండలాల పరిధిలో చెరువులు, బోరుబావుల కింద 36 వేల హెక్టార్లలో వరిపంటను సాగు చేశారు. ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో 8,956 హెక్టార్లలో పొగాకు, 6,386 హెక్టార్లలో పచ్చశనగ, 2,596 హెక్టార్లలో వేరుశనగ, 3,536 హెక్టార్లలో పెసర , 1,547 హెక్టార్లలో మొక్కజొన్న, 894 హెక్టార్లలో జొన్న, 566 హెక్టార్లలో పత్తి, 1,336 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 1,065 హెక్టార్లలో మిరప తదితర పంటలను రైతులు సాగు చేశారు.
డెల్టాను మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా అధికంగా చెరువులు, బోరుబావుల కింద వర్షాధారంగా సాగుచేసిన పంటలే. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు నామమాత్రంగా కూడా కురవలేదు. డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 199 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 6.4 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. దాదాపు 1,800 కు పైగా చెరువుల్లోకి నీళ్లు చేరలేదు.
ఎండుతున్న పంటలు :
ఇప్పటికే రైతులు పంటలు సాగుచేసి 30 నుంచి 40 రోజులకు పైనే కావస్తోంది. చెరువుల్లో ఉన్న కాస్త నీళ్లు అయిపోయాయి. దీంతో మెట్ట ప్రాం తాల్లో 36 వేల హెక్టార్లలో సాగుచేసిన వరినాట్లు నిలువునా ఎండుతున్నాయి. కొందరు రైతులు ఇప్పటికే నాట్లను పశువుల మేత కింద వదిలారు. మరికొందరు తోటి రైతులకు చెందిన బోరుబావుల నుంచి ఒక తడి నీళ్లు పెట్టుకొని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వారు గత్యంతరం లేక, ఆశచావక వరుణిడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో పొగాకు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగాలేదు.
ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి మొక్కలను తడుపుకునే వాళ్లు కొందరైతే, మరికొందరు రైతులు నిస్సహాయ స్థితిలో దేవుడినే నమ్ముకున్నారు. మెట్టప్రాంతాల్లో సాగు చేసిన వేరుశనగ, పచ్చశనగ, పొద్దుతిరుగుడు, పెసర తదితర పంటలన్నీ ఎండుతున్నాయి. పంటలను కాపాడుకునే దారి కనిపించడంలేదు. ఏదో విధంగా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే సోమశిల పరిధిలోనే కావలి, కనుపూరు కాలువల కింద కూడా నీరు సక్రమంగా చేరక పంటలు ఎండుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వర్షం మీద ఆధారపడి వేసిన అన్ని పంటలూ ఈ నెల చివరాంతానికి వర్షం రాకపోతే ఎండిపోతాయని వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగు వేదన
Published Fri, Jan 10 2014 3:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement