=కల్చరల్ ప్రాజెక్టుకు రెండోసారి భూమి పూజ
=మంత్రి సారయ్య మాయ.. కొత్తగా తెచ్చినట్టు డ్రామా
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వారం రోజుల కిందట... అంటే ఈ నెల 11న వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌లో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య కలిసి శంకుస్థాపన చేశారు. రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టే ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలోనే ప్రత్యేకంగా ఈ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తామని.. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను సైతం వరంగల్‌లోనే నిర్వహిస్తామని మంత్రి సారయ్య ఇదే వేదికపై ఘనంగా ప్రకటించారు.
ఇదిలావుంటే.. ఆరున్నరేళ్ల కిందట అదే స్థలం.. అదే వేదికపై... 2007 మార్చి 11న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అదే స్థలంలో భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ వెంట అప్పటి ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రెడ్యానాయక్ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు మంజూరు చేసిన మల్టీ పర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తవ్వ లేదు. అప్పటి నుంచీ ఇప్పటివరకు సారయ్యనే ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
కానీ.. తన హయాంలోనే ఆ ప్రాజెక్టు మంజూరైందని మరిచిపోయారో ఏమో మరి. ప్రాజెక్టును కొత్తగా తాను సాధించి తెచ్చినట్లుగా బతుకమ్మ పండుగకు ముందు రోజు కొబ్బరికాయలు కొట్టిన మళ్లీ భూమి పూజ చేయడం అందరినీ విస్మయపరిచింది. కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంచుకున్న ఎకరం స్థలం.. మెయిన్‌రోడ్డుకు ఆనుకుని, మంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంది.
నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలంలో గడిచిన దశాబ్ద కాలంగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ రాతి ఫలకాలుగానే నిలిచిపోవడం గమనార్హం. 1999లో చంద్రబాబు హయాంలో రూ.65 లక్షల అంచనా వ్యయంతో ఇక్కడ రైతుబజార్ నిర్మించారు. 2007 జనవరి 21న ఈ రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌కు తరలిస్తున్నట్లుగా చెప్పి.. రేకుల షెడ్లన్నీ నేలమట్టం చేశారు. అప్పట్నుంచీ కొత్త ప్రాజెక్టులకు మోక్షం రాకపోగా.. ఈ స్థలం కేవలం శిలాఫలకాలకు, ప్రజాప్రతినిధులు చెప్పుకునే గొప్పలకు వేదికగా మారినట్లు వెక్కిరిస్తోంది.