కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: జిల్లాలో అనేకచోట్ల విద్యుత్ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. ప్రభుత్వం ఓవైపు మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది సరైన పద్ధతిలో స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు తీగలు బిగుతుగా లాగకపోవడం తదితర కారణాలతో జిల్లాలో ఏదోఒక చోట విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.. దీంతో విద్యుత్ నిర్వహణ తీరుపై వినియోగదారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
స్తంభాల ఏర్పాటులో కిరికిరి..
జిల్లాలో ఉన్న సర్వీసులకు సంబంధించి 4.50 లక్షల స్తంభాలు ఉండగా, ఇందులో 11 కేవీ స్తంభాలు 1.85 లక్షలు, ఎల్‌టీ స్తంభాలు 3.25 లక్షలు ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్ల నుంచి 8 మీటర్ల స్తంభాలు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ 8 మీటర్లలో అడుగున్నర స్తంభం భూమిలోకిపోగా మిగిలిన 6 మీటర్ల స్తంభం ఎత్తులో విద్యుత్ తీగలు ఉండాలి. స్తంభానికి, స్తంభానికి మధ్య కనీసం 60 మీటర్ల దూరం ఉండాలనేది నిబంధనగా ఉంది.
అయితే ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై 80 నుంచి 100 మీటర్ల దూరంలో స్తంభాలు ఏర్పాటు చేయడంతో తీగలు నేలను తాకే పరిస్థితి తలెత్తుతోంది. తొండూరు, పులివెందుల, వేంపల్లె, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు మండలాల్లో ప్రధానంగా స్తంభాలు లేకపోవంతో రైతులు విద్యుత్ తీగలను కర్రలకు తగిలించుకుని మోటార్లు ఆడించుకుంటున్నారు. అలాగే పల్లెల్లో కూడా స్తంభాల మధ్య దూరం ఎక్కవగా ఉండటంతో ఇళ్లపై తీగలు వేలాడుతున్నాయి. పాత కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం వెనుక వైపు ఇళ్లను తీగలు తాకుతున్నాయి.
ఇటీవల ఆ ప్రాంతానికి చెందిన వెంకటలక్షుమ్మ అనే మహిళ ఇంటిపై దుస్తులు ఆరవేసేందుకు వెళ్లి కరెంట్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా అవసరాలకు 14 వేల స్తంభాలు కావాల్సి ఉంది. అయితే ఆ స్తంభాలు రాకపోవడంతో తీగలను వ్యవసాయదారులు, గృహ వినియోగదారులు కర్రలపైనే ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి ఉంటోంది. ఆయా ప్రాంతాల విద్యుత్‌శాఖ అధికారులకు సమస్యలపై వినతి పత్రాలు అందజేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో విద్యుత్ సర్వీసులు
జిల్లాలో గృహ విద్యుత్ సర్వీసులు 6,62,550, వ్యాపార సముదాయాలు 54,204 సర్వీసులు, పరిశ్రమల సర్వీసులు 5397, చిన్న పరిశ్రమల సర్వీసులు 569, వ్యవసాయ సర్వీసులు 1,25,507,వాటర్ వర్క్స్ సర్వీసులు 5952, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, వీధి దీపాల సర్వీసులు 4985, పెద్ద పరిశ్రమల సర్వీసులు 245 ఉన్నాయి.
నిలువెత్తు నిర్లక్ష్యం
Published Wed, Dec 18 2013 3:05 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement