ఏపీ సర్కారుకు కస్టమ్స్ ఝలక్
-
స్మగ్లర్ల నుంచి 4,000 టన్నులకుపైగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
-
ఆ ఎర్రచందనం రాష్ట్రానిదేనని, తమకు అప్పగించాలని కస్టమ్స్ శాఖకు లేఖ రాసిన ఏపీ సర్కారు
-
సీజ్ చేసిన ఎర్రచందనం కేంద్రానిదేనంటూ సర్కారు వినతిని తోసిపుచ్చిన కస్టమ్స్ అధికారులు
-
ఎర్రచందనం విక్రయించి నిధులు సమకూర్చు కోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ కస్టమ్స్ శాఖ ఝలక్ ఇచ్చింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 4 వేల టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. తాము సీజ్ చేసిన ఎర్రచందనం కేంద్రానికి చెందుతుందని స్పష్టంచేసింది. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని తామే టెండర్ల ద్వారా విక్రయిస్తామని కస్టమ్స్ శాఖ తేల్చిచెప్పడంతో.. దానిని తాను విక్రయించటం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఎర్రచందనం వేలానికి కసరత్తు...
శేషాచలం అడవుల్లో విస్తారంగా లభ్యమయ్యే ఎర్రచందనం వృక్ష సంపదను స్మగ్లర్లు అక్రమమార్గాల్లో దేశ సరిహద్దులు దాటిస్తోన్న విషయం విదితమే. ఓడరేవులు, విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి కూడా ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చెన్నై, కొచ్చి, కాండ్లా, ముంబై వంటి నౌకాశ్రయాల్లోనూ.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఎర్రచందనాన్ని ప్రత్యేక గోదాముల్లో నిల్వచేశారు. ఇలా నిల్వచేసిన ఎర్రచందనం దుంగలు 4,000 టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా. ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో తిరుపతి, భాకరాపేట, కడప, ఉదయగిరి, కనిగిరి ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసిన 8,584.1353 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో తొలి దశ కింద 4,159.693 టన్నులు అమ్మేందుకు ఈ నెల 8వ తేదీన ఈ-టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు.
కస్టమ్స్ శాఖకు రాష్ట్ర అటవీశాఖ లేఖ...
ఈ క్రమంలోనే సెంట్రల్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన ఎర్రచందనం కూడా రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుబడిందేననే వాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. తమ రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని స్వాధీనం చేయాలని కస్టమ్స్‌శాఖకు జూలై 26న అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వం లేఖ రాయించింది. ఎర్రచందనం విక్రయానికి టెండర్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన దుంగలను తక్షణమే తమకు అప్పగించాలని ప్రభుత్వం కోరింది.
అది ఏపీదేనని ఎలా చెప్పగలరన్న కస్టమ్స్
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కస్టమ్స్ శాఖ తీవ్రంగా స్పందించింది. తాము సీజ్ చేసిన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌దేనని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. సెంట్రల్ కస్టమ్స్ సీజ్ చేసిన ప్రతి వస్తువూ కేంద్రానికే చెందుతుందని స్పష్టంచేసింది. తాము స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని టెండర్ల ద్వారా విక్రయిస్తామని.. వచ్చే ఆదాయాన్ని కేంద్ర ఖజానాలో జమ చేస్తామని తేల్చిచెప్పింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల మొదటి వారంలో కస్టమ్స్ లేఖ రాసినట్లు అటవీశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.