మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : మిర్యాలగూడ పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మా ణం కోసం కాలనీల్లో ఉన్న సీసీ రోడ్లను తవ్వారు. దీంతో వీధులన్నీ గుంతల మయంగా మారాయి. తిరిగి రోడ్లు నిర్మించాల్సి ఉన్నా నిర్మించక పోగా అవసరం లేని చోట నిర్మించారు. అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి ఇష్టానుసారంగా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. ఇళ్లు లేని చోట రోడ్లు నిర్మించి ఉన్న చోట మాత్రం వదిలేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
సీసీ రోడ్ల కోసం రూ.34.53 కోట్లు
మిర్యాలగూడ పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మా ణం చేపట్టిన 84 కిలో మీటర్ల మేర సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 34.53 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. దీనికి తోడు మురికి వాడల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొందరు అధికార పార్టీ నాయకులు తమ ఇష్టాను సారంగా సీసీ రోడ్లు నిర్మించారు. ఇటీవల పట్టణంలో నాన్ ప్లాన్ నిధులు రూ. 51 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు కూడా అధికార పార్టీ నేతలే తమ ఇష్టాను సారంగా నిర్మిస్తున్నారు. ప్రజలకు అవసరం ఉన్న చోట వదిలేసి తమకు ఇష్టమైన ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. కాలనీల్లో రోడ్లు వేయకుండా తమకు సంబంధించిన ప్లాట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తూ వాటి డిమాండ్ పెంచేస్తున్నారు. ముడుపులు ఇచ్చిన వారికి ఇంటి గుమ్మం వరకు కూడా సీసీ రోడ్డు నిర్మించారు.
రోడ్ల వెంట మట్టిపోయని కాంట్రాక్టర్లు
సీసీ రోడ్లు నిర్మించాక పక్క నుంచి మట్టి పోయాల్సిన కాంట్రాక్టర్లు ఆ విషయాన్ని విస్మరించారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక కనీసం క్యూరింగ్ కూడా సక్రమంగా చేయడం లేదు. రోడ్ల పక్కన మట్టిపోయకపోవడంతో ద్విచక్ర వాహనాలు రోడ్డు కిందికి వెళ్లి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
గుంతల మయంగా మారిన రోడ్లు
మా కాలనీలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణం కోసం గతంలో ఉన్న సీసీ రోడ్లను తవ్వారు. కానీ తిరిగి రోడ్లు నిర్మించడం లేదు. దీంతో మా కాలనీలోని రోడ్డు గుంతల మయంగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతో మంది కిందపడి గాయాల పాలవుతున్నారు. కాలనీలు లేని చోట కూడా రోడ్లు నిర్మించి మా కాలనీలో మాత్రం సీసీ రోడ్డు నిర్మించడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.
- అల్లాని సువర్ణ, రెడ్డికాలనీ, మిర్యాలగూడ
కాంట్రాక్ట్ కొట్టేయ్.. రోడ్డు వేసెయ్
Published Thu, Jan 16 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement
Advertisement