వినుకొండలో అధికారులకు సూచనలిస్తున్న ప్రత్యేకాధికారి సలీమ్ ఖాన్
వినుకొండ టౌన్: గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సూపర్ సైక్లోన్ ప్రమాదం పొంచి ఉన్నందున కలెక్టర్ ఆదేశానుసారం అధికారులు అప్రమత్తంగా ఉండాలని వినుకొండ నియోజకవర్గ ప్రత్యేకాధికారి సలీమ్ ఖాన్ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఫైర్, తదితర శాఖల అధికారులతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న తీవ్ర గాలులు, భారీ వర్షాలతో కూడిన తుఫాన్ వచ్చే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల విభాగం అధికారులు సూచించారన్నారు. ప్రకాశం జిల్లాలో మొదలైన వాయుగుండం గుంటూరు జిల్లా బాపట్ల, నిజాంపట్నంల వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రైతులు పంటలు నష్టపోకుండా రానున్న రెండు రోజుల్లో పంట కోతలను మిషన్ల ద్వారా పూర్తి చేసుకోవాలని, కోత కోసిన ఓదేలను వెంటనే గూళ్లు వేయించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కోళ్ల ఫారం యజమానులకు తగు సూచనలు చేయాలని, గ్రామాల్లో ఉన్న పశువులను చెట్లవద్ద కట్టేయకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో వర్షాలకు కూలిపోయే ఇళ్లను గుర్తించి వారిని తరలించేందుకు అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి
నూతనంగా నిర్మించి ధృడంగా ఉన్న పాఠశాల భవనాలను అధికారులు గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీల ద్వారా ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను గుర్తించి వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించాలన్నారు. తుఫాన్ తాకిడికి వారం నుంచి పది రోజల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున మంచినీటి నిల్వలను గ్రామాల్లో ట్యాంకులకు నింపి ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా సురక్షత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సముద్ర స్నానాలు చేసే అవకాశాలు ఉన్నందున వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యాధికారులు సిబ్బంది అవసరమైన అత్యవసర సేవలు అందించేందుకు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అవసరమైన చోట పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆదేశించారు.
సమన్వయంతో చర్యలు తీసుకోవాలి
అధికారుల సెల్‌ఫోన్లు విద్యుత్ ఇబ్బందులతో నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరూ సెలవు పెట్టాలన్న కలెక్టర్ అనుమతి తీసుకోవాలన్నారు. తుఫాన్ అనంతరం పొంచి ఉండే ప్రమాదాలు, అతిసారం, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుఫాన్ సమయంలో మరణాలు, ఆస్తి నష్టాలు, జీవాల నష్టాలను వెంటనే అంచనాలు వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన చోట స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సహాయ సహకారాలను తీసుకోవాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేసి తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు అవగాహన కల్పిస్తు, వారికి ధైర్యాన్ని ఇస్తూ రక్షణ కవచంగా ఉండాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment