హెలెన్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాలతోపాటు నల్గొండ జిల్లాలోని నకిరేకల్, కోదాడల్లో వర్షం పడుతుంది. తీర ప్రాంత జిల్లాలైన కృష్ణా,గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాలోని లక్షలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది. దాంతో చేతి కోచ్చిన పంట ఇలా నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. హెలెన్ తుఫాన్ కారణంగా వీచిన ఈదురుగాలులకు వృక్షాలు సైతం నేలకొరిగాయి.
విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దాంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో కోస్తా తీరం వెంబడి పలు జిల్లాలు గాఢంధకారంలో చిక్కుకున్నాయి. గత కొద్ది రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్యకారులు శనివారం తెల్లవారుజామున అంతర్వేది తీరం నాలుగు బోట్లతో చేరుకున్నారు. హెలెన్ తుఫాన్ నిన్న సాయంత్రం తీరం దాటింది అయితే మరో 24 గంటల పాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తునే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాంతో జిల్లాలకు చెందిన అధికారులు అప్రమత్తం అయ్యారు.