
తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు నాగు
విశాఖపట్నం, గొలుగొండ (నర్సీపట్నం): పప్పుశెట్టిపాలెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం గ్యాస్ లీకై మంటలు వ్యాపించి ఇద్దరు గాయపడ్డారు. ఉపాధ్యాయుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. మంటలు పాఠశాల గది స్లాబ్ వరకు దట్టంగా వ్యాపించడంతో చిన్నారులు హడలిపోయారు. వెంటనే ఉపాధ్యాయుడు శ్రీపాద లక్ష్మీనరసింహ (నాగు) పక్కనున్న గోనెను తీసుకొని మంటలను అదుపు చేస్తూ చిన్నారులను బయటకు పారిపోవాలని అరిచారు. చిన్నారులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు నాగుతోపాటు మరో విద్యార్థినికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పప్పుశెట్టిపాలెం పాఠశాలలో బుధవారం నుంచి గ్యాస్‌పై మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్, పొయ్యి సిద్ధం చేశారు. కొత్తగా కొనుగోలు చేసిన పొయ్యి ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ ఏర్పాటు చేసి వెలిగించారు.
అప్పటికే సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ 20 మంది విద్యార్థులు ఉండటంలో వారికి ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడు నాగు పక్కన ఉన్న గోనెతో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ విద్యార్థులను అప్రమత్తం చేశారు. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఆ ఉపాధ్యాయుడి చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. శివజ్యోతి అనే విద్యార్థినికి స్వల్పగాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు నా గును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివజ్యోతిని తల్లిదండ్రులు గొలుగొండ పీహెచ్‌సీకి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చా రు. వాహనం వచ్చే సరికే గ్రామస్తులు ఇసుక, నీటితో మంటలు అదుపు చేశారు. గొలుగొండ ఎస్‌ఐ ఉమామహేశ్వర్రావు సంఘటన వివరాలు సేకరించారు.
ఆర్డీవో జోక్యంతో వైద్యం
నర్సీపట్నం: గ్యాస్ సిలెండర్ లీక్‌తో గాయపడిన ఉపాధ్యాయుడు నాగు మాస్టర్‌కు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. గాయ పడిన నాగును 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అప్పటికి సిబ్బంది మాత్ర మే ఉన్నారు. 2 గంటలకు తీసుకువచ్చిన ఉపాధ్యాయుడిని 3.30 వరకు ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విశాఖ కేజీహెచ్ తీసుకువెళ్ళాలని సి బ్బంది సూచించడంతో ఈ విషయాన్ని తోటి ఉపాధ్యాయులు పీఆర్‌టియు యూనియన్ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఉపాధ్యాయ నాయకులు జి.రమేష్, వరహాలనాయుడు సిబ్బందిని నిలదీశారు. యూనియన్ నాయకులు ఈ విషయాన్ని మంత్రి అయ్యన్న దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్డీవో కె.సూర్యారావు ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధా శారదకు ఫోన్ చేసి రప్పించారు. ఆమె వెంటనే వైద్యులను రప్పించి నాగుమాస్టర్‌కు వైద్యం అందించడంతో వివాదం సద్దుమణిగింది.