నువ్వెంత... పిల్లోడివి: డి.శ్రీనివాస్ | D. srinivas takes on chief minister kiran kumar reddy | Sakshi
Sakshi News home page

నువ్వెంత... పిల్లోడివి: డి.శ్రీనివాస్

Published Sat, Aug 10 2013 2:41 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

నువ్వెంత... పిల్లోడివి:  డి.శ్రీనివాస్ - Sakshi

నువ్వెంత... పిల్లోడివి: డి.శ్రీనివాస్

సాక్షి, నిజామాబాద్: నువ్వెంత? నీ అనుభవమెంత? పిల్లోడివి... ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రివి కాలేదు... సోనియాగాంధీ దయతో ఆ సీట్లో కూర్చున్నావ్... ఇప్పుడు ఆమె నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నావ్... కేంద్రప్రభుత్వం, అధిష్టానం నిర్ణయాన్నే ధిక్కరిస్తున్నావ్... భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావ్... ఇప్పటికైనా నీ ప్రవర్తన సరిదిద్దుకో... లేదంటే హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి పీసీసీ మాజీ అధ్యక్షుడు, సమన్వయ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు.
 
 ఆయన శుక్రవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ హై కమాండ్ స్థాయిలో జరిగిన అన్ని చర్చల్లోనూ ముఖ్యమంత్రిగా పాల్గొన్న కిరణ్... సోనియా తీసుకున్న నిర్ణయం తెలియదని చెప్తే ప్రజలెలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ‘‘మంత్రులకు తెలియకుండానే వాళ్ల శాఖలకు చెందిన విషయాలపై జీఓలు విడుదల చేసిన ముఖ్యమంత్రివి నువ్వు. ఆ జీఓలపై మంత్రులు ఎదురు తిరిగితే... సీనియర్లు అని కూడా చూడకుండా బర్తరఫ్ చేశావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, హై కమాండ్ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు.
 
 సోనియాగాంధీ, ప్రధానిలతో జరిగిన కోర్ కమిటీలో రాష్ట్ర విభజనపై నువ్వు గంటకుపైగా ప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రత్యేకంగా మాట్లాడటం వాస్తవంకాదా? చిదంబరం, షిండేలు హోం మంత్రులుగా సీఎం హోదాలో మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా? ఈ రోజు మాత్రం మంత్రులు, ప్రజలను తప్పుదారి పట్టించేలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తప్పుడు లెక్కలు ఎందుకు చెబుతున్నావు? యువకుడనే ఉద్దేశంతో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు సీఎం పదవిని కట్టబెడితే మీరిచ్చే బహుమానం ఇదేనా?’’ అని  ధ్వజమెత్తారు. గతంలో సీఎంలుగా, ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న షిండే, గులాంనబీ అజాద్, ఏకే అంటోనీ, చిదంబరంలకు ఉన్న రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షతలో నీ అనుభవం ఎంత? అని నిలదీశారు. జాతీయ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ మౌనంగా ఉండటానికి మనసెలా ఒప్పిందని కిరణ్‌కుమార్‌రెడ్డిపై డీఎస్ నిప్పులు చెరిగారు.
 
 పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకమా?
 రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని హై కమాండ్ తీసుకున్న తెలంగాణ నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సంతకం పెట్టడం ఏమిటని డీఎస్ నిలదీశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసినప్పుడు కూడా తెలంగాణపై సంతకం చేయలేదని చెప్పారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌కు రూపకల్పన జరుగుతున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు షిండే, చిదంబరంలు వెల్లడిస్తే ఇది ప్రభుత్వ ప్రకటన కాదా? అని ప్రశ్నించారు. దీన్ని పార్టీలో తీసుకున్న నిర్ణయంగా సీఎంతో సహా పలువురు మంత్రులు పేర్కొనటం ఎలా సమంజసమవుతుందన్నారు.
 
  ఏ పదవి ఆశించకుండా దేశంలో పార్టీని బలోపేతం చేస్తున్న రాహుల్‌ను ప్రధానిని చేయటానికే కిరణ్ చేతికి పగ్గాలు ఇచ్చిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, ఇక్కడే చదువుకున్నానని చెబుతున్న సీఎంను ఎవరు ఇక్కడి నుంచి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. యావత్తు దేశంలో ఉన్న తెలుగువారిని భయాందోళనలకు గురిచేసే విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని డీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ వాసిననే చెబుతూ సీమాంధ్రులకు భయం కలిగించే విధంగా, స్వేచ్ఛకు హాని కలిగే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం మాటలతో కర్ణాటక, తమిళనాడులో ఉన్న తెలుగువారు కూడా భయాందోళలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.  
 
 తెలంగాణను ఎవ్వరూ ఆపలేరు
 సోనియాగాంధీ ప్రకటించిన తెలంగాణను ఎవరూ ఆపలేరని, సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రాష్ట్రంగా అభివృద్ధి దిశగా ముందుకుసాగుతుందని డీఎస్ చెప్పారు. సమస్యలు నెలకొన్నప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటారని విలీనం సమయంలోనే నెహ్రూ చెప్పారని గుర్తుచేశారు. 1969, 1972లలో జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినా కలిసి ఉన్నామని, కేవలం ఉద్యోగుల కోసమే విడిపోతున్నామని స్పష్టంచేశారు. జెంటిల్‌మెన్, సేఫ్‌గార్డు ఒప్పందాలు, 610 జీఓల వంటివిఅమలైతే ఈ పరిస్థితులు వచ్చేవి కాదేమోనని అభిప్రాయపడ్డారు.
 
 రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్, సాగునీటి సంక్షోభం ఏర్పడుతుందని సీఎం చెబుతున్న మాటలు ఉత్త అపోహలు మాత్రమేనని డీఎస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వివాదాల పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్న విషయం తెలిసిందేనన్నారు. పాకిస్థాన్, భారత్ మధ్య నదులు ఉన్నాయని, యూరప్‌లోని ఏడు దేశాలు నదీజలాలను పంచుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ లోటు లేదని, 80 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పాదనకు అవసరమయ్యే బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement