
పోస్టుమార్టం అడ్డుకున్న దళిత సంఘాలు
చీమకుర్తి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేసే వరకూ పోస్టుమార్టం చేసేందుకు వీల్లేదని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి గోనుగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన పులిపాటి యోగమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు గురువారం సిద్ధమవుతుండగా దళిత సంఘాల నేతలు వచ్చి అడ్డుకున్నారు.
కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుడ్డు వెంకట్రావు మాట్లాడుతూ పొట్టచేతబట్టుకొని కూలి పనులకు వెళ్లిన మహిళల్లో ఒకరు మరణించగా మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారని చె ప్పారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డ వారి కుటుంబానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులిపాటి శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు రెండు చేతులూ తెగి పడ్డాయి. అల్లడి ఆదెమ్మ, బత్తుల ఈశ్వరమ్మ, బత్తుల కోటేశ్వరి, భూతం లక్ష్మిలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.