యానాం/కాకినాడ క్రైం/తాళ్లరేవు: కష్టపడి సంపాదించుకుని.. మెరుగైన జీవితం గడపాలని ఒకరు.. కుమార్తె వివాహం చేయాలని మరొకరు.. బిడ్డలను మంచి చదువులు చదివించి, ప్రయోజకుల్ని చేయాలని ఇంకొకరు.. ఇలా ఆ కుటుంబాలు కన్న కలలు కళ్ల ముందే చెదిరిపోయాయి.. కన్నీటినే మిగిల్చాయి.. తాళ్లరేవు ఆటో ప్రమాదంలో మృతి చెందిన యానాం మహిళల కుటుంబాల్లో సోమవారం నెలకొన్న విషాద భరిత దృశ్యమిది. తాళ్లరేవు – యానాం మధ్య సుబ్బారాయుని దిమ్మ ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో యానాం, పరిసర ప్రాంతాలకు చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు కాకినాడ జీజీహెచ్ వైద్యులు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడం వల్లనే ఈ మహిళలందరూ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు.
మృతుల్లో ఒక మహిళకు కాళ్లు తెగిపోయాయని, ఇద్దరికి పక్కటెముకలు నుజ్జునుజ్జయ్యాయని తెలిపారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, పెదపూడి, కోరింగ ఎస్సైలు వాసు, పి.శ్రీనివాస్ కుమార్ తదితరులు ఉదయం నుంచీ కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దనే ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో యానాం తీసుకువచ్చి, ఘన నివాళులర్పించారు.
బూడపనీటి సత్యవతి (బాలయోగి నగర్), కల్లి పద్మ (కొత్తబస్టాండ్ వెంకట్‌నగర్), బొక్కా అనంతలక్ష్మి (ఫ్రాన్స్‌తిప్ప), చెందిన శేశెట్టి వెంకటలక్ష్మి (మెట్టకూరు), నిమ్మకాయల వెంకటలక్ష్మి (కురసాంపేట), చింతపల్లి జ్యోతి (వెంకట్ నగర్) మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల నడుమ స్థానిక టైడల్ లాక్ సమీపాన హిందూ శ్మశాన వాటిక, మెట్టకూరు శ్మశాన వాటికల్లో ఆ మహిళల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల ఇళ్ల వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. హిందూ శ్మశాన వాటిక వద్ద మృతదేహాలకు మల్లాడి కృష్ణారావు, ఆర్‌ఏఓ మునిస్వామి కడసారి నివాళులర్పించారు.
ఇద్దరిపై కేసు
ఈ ప్రమాదానికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు కోరంగి ఎస్సై పి.శ్రీనివాస కుమార్ తెలిపారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపి, ఏడుగురి మృతికి, మరో ఏడుగురు గాయపడేందుకు కారకుడైన బస్సు డ్రైవర్ వేగిరాజు సుధీర్, క్లీనర్ ముంగమూరి మహేష్‌లపై కాకినాడ డీఎస్పీ మురళీ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి, కోర్టుకు తరలించామన్నారు.
అధైర్యం వద్దు.. ఆదుకుంటాం
మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవ్వరూ అధైర్యపడొద్దని, ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, వ్యక్తిగతంగా తాను ఒక్కో మృతురాలి కుటుంబానికి రూ.లక్ష చొప్పున రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. మృతులకు రొయ్యల ఫ్యాక్టరీ నుంచి బీమా ఉందని, దీంతోపాటు వారు సైతం ఒక్కొకరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో తాను మాట్లాడానని, వారి నుంచి సైతం రూ.3 లక్షల చొప్పున సహాయం అందుతుందని చెప్పారు.
దీనిపై ఇప్పటికే అధికారులు సైతం చర్చిస్తున్నారన్నారు. అలాగే, మల్లాడి కృష్ణారావు కూడా వ్యక్తిగతంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. దీంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి సైతం మరింత సహాయం అందేలా చర్యలు చేపట్టామని అశోక్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎవ్వరైనా బాధిత కుటుంబాలను స్వచ్ఛందంగా ఆదుకోవచ్చని అన్నారు. మొత్తం మీద ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకూ సహాయం అందే అవకాశం ఉందని చెప్పారు. అలాగే క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున అందిస్తామన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
మద్యం మత్తులోనే ప్రమాదం!
మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. డీజిల్ నింపుకొనేందుకు కాకినాడ నుంచి యానాం పట్టణానికి మోజో ట్రావెల్స్ బస్సును డ్రైవర్, క్లీనర్ తీసుకువచ్చారు. డీజిల్ నింపుకొన్న అనంతరం వారు మద్యం తాగినట్టు సమాచారం. ప్రమాద సమయానికి ఆ ఆ బస్సును డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడుపుతున్నట్టు తెలిసింది. మద్యం మత్తులో బస్సును అదుపు చేయలేక, పక్కనే ఉన్న రెయిలింగ్‌ను, అనంతరం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పరిమితికి మించి మహిళా కార్మికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ గిడ్డి వెంకటేశ్వరరావుపై కూడా కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment