రక్ష కోసం వెళితే కక్ష కట్టిన విధి
ఓ ఘటనలో తల్లి మృతి
మరోచోట బాలిక దుర్మరణం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాఖీ పౌర్ణమి వేళ మృత్యు గంట మోగింది.. అనుబంధాలను దూరం చేసింది.. రక్ష కోసం వెళ్తే విధి కక్ష కట్టింది.. రక్షా బంధన్ వేడుక ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగి ల్చింది.. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో జరిగిన ఘటనలు ప్రతి హృదయాన్నీ కలచివేసింది.. తన కూతురితో కుమారుడికి రాఖీ కట్టించి వస్తుండగా ఓ తల్లి మృతి చెందగా, మరో ఘటనలో బాలిక దుర్మరణం పాలవ్వడం తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఈ హృదయ విదారక ఘటనల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన కనకాల సత్యశ్రీ (42)కి ఇద్దరు పిల్లలు. కుమారుడు కాతేరు తిరుమల కళాశాలలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ఏటా ఆ ఇంట రాఖీ వేడుకలు చేస్తుంటారు. సోమవారం ఉదయమే తలస్నానం చేసిన సత్యశ్రీ ఏటా మాదిరిలానే తన తమ్ముడికి రాఖీ కట్టింది. అలాగే తన కుమారుడికి కుమార్తెతో ఎలాగైనా రక్షాబంధన్ కట్టించాలనుకుంది. తన తమ్ముడిని బతిమాలి కుమార్తెతో సహా ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం రూరల్ కాతేరుకు బయల్దేరి కుమారుడిని కలిసింది. తాను దగ్గరుండి మరీ కుమార్తెతో రాఖీ కట్టించి స్వీట్లు తినిపించి కొంతసేపు ఆనందంగా గడిపింది. కొడుకుకి వీడ్కోలు చెప్పిన ఆమెకు అదే చివరి వీడ్కోలు అవుతుందనుకోలేదు. తన తమ్ముడు, కుమార్తెతో కలసి తిరిగి కొత్తపేటకు బయల్దేరింది.
కాతేరు ఎర్రకాలువ సమీపంలో ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన వ్యాన్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాద ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో సత్యశ్రీ తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే దుర్మణం పాలైంది. ఆమె తమ్ముడు, కుమార్తెలకు గాయాలయ్యాయి. వారి కళ్లముందే సత్యశ్రీ మృతి చెందడం చూసిన వారు దిగ్భాంతికి గురయ్యారు. ఘటనా స్థలంలోనే వారు రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలిసిన మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృత్యువు దారి మళ్లించిందా..
ప్రమాదానికి కారణమైన వ్యాన్ నిజానికి గామన్ బ్రిడ్జి వంతెనపై నుంచి దిగి పేపర్‌మిల్లుకు వెళ్లాలి. అయితే ఆమైపె పగబెట్టిన విధి ఆ వ్యాన్‌ను దారి తప్పించేలా చేసింది. గామన్ వంతెనపై నుంచి కిందకు దిగిన ఆ వ్యాన్ డ్రైవర్ పేపర్‌మిల్లు మార్గం ఎటో తెలియక అయోమయానికి గురై తొర్రేడు వైపు తిరిగి ఆమె మరణానికి కారణమయ్యాడు. విధి ఆ ఇంట ఆనందంతో ఆడుకుంది. వ్యాన్ డ్రైవర్ సవ్యదిశలో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో అని స్థానికులు అనుకోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment