దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి (316డి)పై దేవరపల్లి మండలం బందపురం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఇలా.. కృష్ణాజిల్లా నందిగామ జానకి రామయ్య కాలనీకి చెందిన వేల్పూరు విజయ మోహన్, సజని గ్రేస్, కుమార్తె అమితాశ్రీ, కుమారుడు రోవిన్ జేదిద్యతో కలిసి కారులో మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుంచి విశాఖపట్నం బయలు దేరారు.
వీరి కారు దేవరపల్లి మండలం బందపురం వద్ద హైవేపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ముందు టైర్ పంక్చర్ కావడంతో డివైడర్‌ను దాటి కుడి వైపు రోడ్డులో సుమారు 200 మీటర్లు దూసుకుపోయింది. ఆ సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వెళుతున్న కారులోని ఇండిగ శుభాష్ గౌడ్, భార్య దివ్య ప్రియ (25), తల్లి రమాదేవి, కుమార్తె గనిష్క (18 నెలలు), బంధువు ఈడిగ మల్లికార్జున్, స్వప్న, మేనల్లుడు వికాష్ సాయి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే విశాఖపట్నం వెళుతున్న కారులోని వేల్పూరు విజయ మోహన్, సజని గ్రేస్, అమితాశ్రీ, రోవిన్ జేదిద్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ దేవరపల్లి, కొవ్వూరులో ఆసుపత్రులకు 108, హైవే అంబులెన్స్‌లలో తరలించారు.
చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
దేవరపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి గనిష్క మృతి చెందగా, రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ దివ్య ప్రియ, రమాదేవి మృతి చెందారు. బాలిక మృతదేహాన్ని పోలీసులు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుభాష్ గౌడ్, విజయ మోహన్, సజని గ్రేస్ దేవరపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో, అమితాశ్రీ, రోవిన్ జేదిద్య రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు వచ్చి...
శుభాష్ గౌడ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య దివ్య ప్రియ పుట్టిల్లు విశాఖపట్నం. నూతన సంవత్సర వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి అత్తవారి ఇంటికి వెళ్లాడు. వేడుకలను జరుపుకొని తిరిగి వస్తుండగా కారు రూపంలో మృత్యువు వెంటాడింది. అయితే కుమార్తె, భార్య, తల్లి మృతి చెందిన విషయాన్ని సాయంత్రం వరకు శుభాష్ గౌడ్‌కు తెలియకుండా గోప్యంగా ఉంచారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వెంకట్రావు
దేవరపల్లి మండలం గౌరీపట్నంలో జగనన్న సురక్ష రెండో విడత కార్యక్రమానికి హాజరై అటువైపు వస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రమాదాన్ని చూచి చలించిపోయారు. ప్రమాద స్థలం వద్ద ఆగి సహాయక చర్యలు చేపట్టారు. 108, హైవే అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. హైవేపై వెళుతున్న ప్రయాణికులు, చుట్టుపక్కల పొలాల్లో పని చేస్తున్న కూలీల సహకారంతో క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి, గౌరీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయాలని ఆసుపత్రుల వైద్యాధికారులకు సూచించారు. ట్రైనీ డీఎస్పీ భానోదయ, దేవరపల్లి సీఐ అనసూరి శ్రీనివాసరావు, సిబ్బంది హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment