బాలయ్య వైఖరికి నిరసనగా ధర్నా
హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయకుండా వెళ్లడంతో ఆగ్రహించిన దళితులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం హిందూపురం నియోజకవర్గం పరిధిలోని లేపాక్షిలో జరిగింది. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బాలకృష్ణ లేపాక్షి మీదుగా హిందూపురం వెళ్లారు. లేపాక్షి జాతీయరహాదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా పూలమాలలతో అలంకరించారు.
లేపాక్షి మీదుగా హిందూపురం వెళ్తున్నబాలయ్య మార్గమధ్యలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేస్తారని చెప్పడంతో దళితులు ఆయన కోసం నిరిక్షించారు. అయితే, విగ్రహం పక్కనుంచే వెళ్లిన ఆయన ఆగకపోవడంతో ఆగ్రహించిన దళితులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. బాలయ్య వెనక్కు వచ్చి పూలమాల వేసే వరకు ఆందోళనను విరమించేది లేదని వారు భీష్మించారు. విషయం తెలిసిన హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప లేపాక్షికి వచ్చి దళితులను సముదాయించి విగ్రహనికి పూలమాల వేసి వెళ్లారు.