దళితులను ఆదరించింది వైఎస్ కుటుంబమే
తిరుపతి ఎంపీ వరప్రసాదరావు
నెల్లూరు: ‘‘దళితులను వైఎస్ కుటుంబం ఆదరించినంతగా మరే కుటుంబం, ఏ పార్టీ కూడా ఆదరించి అక్కున చేర్చుకోలేదు. దళితులకు వైఎస్సార్‌సీపీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలోనూ లేదు. అంతెందుకు ప్రాంతీయ పార్టీల్లో దళితులను మాట్లాడనివ్వడమే గగనం. అలాం టిది అనేకమంది దళిత నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే’’ అని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామితో కలిసి ఆయన ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వైఎస్ కుటుంబం జూపూడి ప్రభాకరరావుకు ఇచ్చినంత ప్రాధాన్యం మరెవరికీ ఇవ్వలేదన్నారు. నాడు వైఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారని గుర్తు చేశారు. తాజాగా వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారన్నారు. జూపూడి ఓటమికి పార్టీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డిని నిందించడం సరికాదన్నారు. సుబ్బారెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమిని కోరుకుంటారనడం సరికాదన్నారు. ఓటమి బాధలో జూపూడి కీలక నేతలను నిందించడం సరికాదన్నారు.