హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఓ ఘటన ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకోగా, మరొకటి పంజగుట్ట ఫ్లైఓవర్‌పై జరిగింది. అదృష్టవశాత్తు రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే వ్యాపారి లలిత్.. ఆదివారం ఉదయం మద్యం మత్తులో తన వోక్స్‌వ్యాగన్ వెంటో (ఏపీ9 సీడీ 531)లో బేగంపేట నుంచి బంజారాహిల్స్‌కి వెళుతున్నారు.
పంజగుట్ట ఫ్లైఓవర్ పై హిమాలయ బుక్ డిపో మలుపు వద్ద కారు అదుపు తప్పి రెయిలింగ్‌కు రాసుకుంటూ వెళ్లింది. దీంతో కారుకు మంటలు వ్యాపించాయి. వెంటనే తేరుకున్న లలిత్ బయటకు దూకేశారు. చూస్తుండగానే వాహనం మంటల్లో దగ్ధమైపోయింది. అనంతరం ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పగా, పోలీసులు ఆ కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. లలిత్‌ను ఆసుపత్రికి తరలించారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై: అప్పటి వరకు ఔటర్ రింగ్‌రోడ్డుపై రయ్యిమని దూసుకుపోతున్న కారు.. ఒక్కసారిగా మంటల్లో కాలిపోయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మ్రినాల్.. తన స్వస్థలం ఢిల్లీ వెళ్లడానికి నల్లగండ్ల నుంచి తన వేగన్-ఆర్ కారు (డీఎల్2సీజెడ్ 5688)లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. నార్సింగ్ దాటేసరికి కారులో కాలుతున్న వాసన రావటంతో అనుమానంతో పక్కన నిలిపేశారు. కిందకు దిగి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆయన కళ్ల ముందే కారు పూర్తిగా కాలిపోయింది. రెండు రోజులక్రితం కారును సర్వీసింగ్‌కు ఇచ్చానని, లోపల నీరుండటంతోనే వైర్లకు మంటలు వచ్చి ఉంటాయని బాధితుడు పేర్కొన్నారు.