
‘ఔటర్’ బేజార్ !
- ప్రమాణాలు గాలికి...
- ప్రాణాలు మృత్యుఒడికి
- ‘రింగ్‌రోడ్డు’పై ప్రయాణం గందరగోళం
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మించామని గొప్పలు చెబుతున్న హెచ్‌ఎండీఏకు ఈ మార్గంలో తరచూ జరుగుతోన్న ప్రమాదాలు మాయని మచ్చను తెచ్చిపెడుతున్నాయి. 120 కి.మీ వేగంతో ప్రయాణించేందుకు వీలుగా నిర్మించే మార్గంలో ఎక్కడా గతుకులకు అవకాశం ఉండకూడదు. రోడ్డు సమాంతరంగా ఉంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అయితే... ప్రధాన రోడ్డు అనేకచోట్ల ఎగుడు దిగుడుగా ఉండటంతో హైస్పీడ్‌లో వెళ్లే పవర్ స్టీరింగ్ వాహనాలు కాస్త దిశమారితే ఘోరం జరుగుతోంది.
రోడ్డు మలుపులను సరిగ్గా డిజైన్ చేయకపోతే అక్కడే మృత్యువు మాటేసి ఉంటుంది. ఔటర్‌పై అక్కడక్కడా ఉన్న మలుపుల వద్ద కూడా హైస్పీడ్ వాహనాలు ఫల్టీ కొడుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ డిజైన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సైనేజెస్ (సూచికలు) అవసరమైన చోట ఏర్పాటు చేయకపోవడం పెద్ద లోపంగా కన్పిస్తోంది.
ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు మధ్యలో 500 మీ. ఒక సైన్‌బోర్డును తర్వాత 100 మీ. ఒకటి, అనంతరం ఎగ్జిట్ (కిందకు దిగేచోట) వద్ద మరొకటి విధిగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. అయితే... ఈ క్రమంలో అన్ని చోట్ల సైనేజీలు కన్పించట్లేదు. సరిగ్గా ఎగ్జిట్ పాయింట్ వద్దే ఆ జంక్షన్ సైన్‌బోర్డును ఏర్పాటు చేయడంతో దాన్ని గుర్తించని వాహనచోదకులు ముందుకెళ్లిపోతున్నారు. ఒకవేళ ఎగ్జిట్‌పాయింట్ వద్ద సైనేజిని చూసి వెంటనే షడెన్‌గా బ్రేక్ వేస్తే వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం బలంగా ఢీకొని ప్రమాదం సంభవిస్తోంది.
ఒకే మార్గంలో..
కోకాపేట జంక్షన్ వద్ద ఒకే ర్యాంపుపై ఎదురెదురుగా కార్లు, ఇతర వాహనాలు ప్రయాణిస్తుండటం విస్మయం కల్గిస్తోంది. ఈ జంక్షన్ (ఇంటర్‌ఛేంజి)లో మొత్తం 4 ర్యాంపులు నిర్మించాల్సి ఉండగా 100 మీటర్లకు సంబంధించి భూసేకరణపై కోర్టులో వివాదం నడుస్తుండటంతో ఇక్కడ 3 ర్యాంపులే నిర్మించారు. ఫలితంగా ఒకవైపు ఔటర్‌పైకి ఎక్కేందుకు, దిగేందుకు ఒకే ర్యాంపును వినియోగించాల్సి వస్తోంది.
కిందనుంచి ఔటర్‌పైకి వెళ్లే వాహనం 40 కి.మీ. వేగానికి మించకుండా ప్రధాన రోడ్డుపై ఓక్సిలరీ లైన్‌లోనే ప్రయాణించాలి. అయితే... కార్లు, లారీలు మితిమీరిన వేగంతో ఔటర్‌పైకి ఎక్కుతుండటంతో అటువైపు నుంచి 120 కి.మీ వేగంతో వస్తున్న వాహనంతో ఢీకొంటున్నాయి. ఔటర్ పొడవునా ఫెన్షింగ్ మెష్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల అండర్‌పాస్‌ల వద్ద వదిలేశారు. ఇక్కడ ఔటర్ పైకి సులభంగానే పశువులు, ఇతర జంతువులు వెళ్తున్నాయి. వీటివల్ల రాత్రుల్లో ఘోరం జరిగిపోతోంది.