అక్రమాలపై కృష్ణ చక్రం
సాక్షి, గుంటూరు: బియ్యం, ఇసుక, కిరోసిన్ అక్రమ రవాణాపై గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న సీఐలు, ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొందరిని వీఆర్‌కు పంపారు.
గతంతో పోలిస్తే ఇసుక అక్రమ రవాణా ఇప్పుడు తగ్గింది. అయితే రాత్రిళ్లు వారి కార్యకలాపాలు అధికమయ్యాయని అందిన ఫిర్యాదుల మేరకు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న విషయం అందరికీ తెలిసిందే.
గతంలో విజిలెన్స్ అధికారులు హడావుడి చేసినప్పుడల్లా మిన్నకుండే అక్రమ వ్యాపారులు ఆ తరువాత ఎప్పటిలా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం దాచేపల్లి, నాగార్జునసాగర్ వద్ద రెండు సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని అంతా భావించారు. అయితే అక్రమార్కులు అక్కడి ఉద్యోగులను సైతం మేనేజ్ చేసి తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
జిల్లాలో బెల్ట్‌షాపులు రద్దు చేసినప్పటికీ అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు అందడంతో రూరల్ ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు.
రహస్య టీమ్‌ల ఏర్పాటు ...
జిల్లాలో అక్రమ వ్యాపారాలు, రవాణాలపై అందుతున్న ఫిర్యాదుల మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ రహస్యంగా తనకు నమ్మకంగా ఉండే అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ తనకు వచ్చే సమాచారాన్ని ఈ టీమ్‌లకు అందించి వారి ద్వారా దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ విధానంలో నాలుగురోజుల్లోనే సుమారు 10 లారీల బియ్యాన్ని పట్టుకున్నారు. దాడులు చేస్తున్నట్లు ఆ ప్రాంతంలోని పోలీస్ అధికారులకు సైతం సమాచారం అందించడం లేదు.
వరస దాడులు చేస్తూ అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నచోట స్థానిక అధికారులపై ఎస్పీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. బియ్యంతోపాటు ఇసుక, బెల్టుషాపులపై కూడా ఎస్పీ నియమించిన రహస్య టీమ్ దాడులు చేస్తుండటంతో పోలీస్ అధికారులు హడలిపోతున్నారు.
ఇటీవల బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారనే కారణంతో దాచేపల్లి ఎస్‌ఐ కోటేశ్వరరావును వీఆర్‌కు పంపారు. దీంతో అప్రమత్తమైన గురజాల డీఎస్పీ పూజ మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.దీనికితోడు ఇటీవల జరిగిన బదిలీల్లో రాజకీయంగా ఒత్తిడి తెచ్చి పోస్టింగ్‌లు వేయించుకున్న పలువురు సీఐల పనితీరుపైఎస్పీ ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం.