సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల సమీకరణలు, ఎత్తుకు పైఎత్తులు ప్రారంభమయ్యాయి. యూటీఎఫ్ మద్దతుతో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, టీడీపీ మద్దతుతో ఏఎస్ రామకృష్ణ పోటీ చేస్తున్నారు. మూడోసారి పోటీ చేస్తున్న లక్ష్మణరావుకు ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభిస్తుండటంతో, గెలుపే ధ్యేయంగా టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. వివిధ సామాజిక వర్గాల్లో పేరు ప్రతిష్టలు కలిగిన ఆ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వాటికి అదే సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఆహ్వానించి పార్టీ మద్దతు పలికిన ఏఎస్ రామకృష్ణకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతోంది. ఆదివారం గుంటూరులోని గ్రాండ్ నాగార్జున హోటల్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమావేశం జరిగింది. దీనికి టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ యాదవ సామాజిక వర్గానికి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తోందని, యాదవ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇదే విధంగా టీడీపీలో ఇతర సామాజిక వర్గాల నేతలు ఆ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుంటే, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చేసిన సేవలే తనను గెలిపిస్తాయనే భావనతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రచారంలో దూసుకువెళుతున్నారు.
బీసీ వర్గాల నుంచి మూడో అభ్యర్థి .. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యం కానున్నది. తాజాగా దళిత, గిరిజన, బీసీ సంఘాల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 18,006 మంది ఓటర్లు ఉండగా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఓట్లు 10 వేల వరకు ఉన్నాయి.
తమ వర్గాల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితే కనీసం ఆరు వేల ఓట్లు పడినా గెలుస్తాడనే భావనలో ఈ సంఘాలు ఉన్నాయి. ఈ వర్గాల నుంచి దీటైన అభ్యర్థిని నిలిపే బాధ్యతను న్యాయవాది వైకేకు అప్పగించారు. అభ్యర్థి ఎంపికపై ఈ వర్గాలు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయానికి వస్తామని వైకే ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు.
మనం..మనం..ఒకే గణం
Published Mon, Feb 23 2015 3:36 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM