
తిరుమల: క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు
చిత్తూరు , తిరుమల: తిరుమలలో సామాన్య భక్తుల అవస్థలు అధికారులకు పట్టడం లేదు. వీఐపీల సేవకే ప్రాధాన్యతనిస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం లేదు. ఫలితంగా గంటల తరబడి సామాన్యులు సర్వదర్శనంలో నరకం చూస్తున్నా రు. పెరటాసి మాసాన్ని తమిళనాడులో పవిత్రం గా భావిస్తారు. ఈనెలంతా ఆ రాష్ట్రానికిచెందిన భక్తుల తాకిడి తిరుమలకు ఎక్కువగానే ఉంటుంది. ఏటా ఎదురవుతున్న అనుభవమే ఇది. తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వందల కిలోమీటర్లు కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. మరోపక్క మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగానే వస్తున్నారు. వేసవి సెలవుల తరహాలో ఇప్పుడు రద్దీ కనిపిస్తోంది.
రోజుకు 80 వేల నుంచి లక్ష మంది వరకు వస్తున్నారని అంచనా.. భక్తులతో క్యూలు నిండిపోతున్నాయి. ఎటుచూసినా భక్త జనసందోహంగా మారింది తిరుమల. భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఇందుకు అనుగుణంగా త్వరితగతిన దర్శన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది. కానీ వీరికివేమీ పట్టడం లేదు. 3 కిలోమీటర్ల మేర వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూ బయటకు భక్తుల వేచి ఉన్నా స్పందిం చడం లేదు. సర్వదర్శనానికి క్యూలో 15 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. సామాన్య భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం, టైం స్లాట్ సర్వదర్శనం టిక్కెట్లను నిలిపివేయడంపై ఉన్న శ్రద్ధ వీఐపీ బ్రేక్‌ను నియంత్రించడంలో లేదని భక్తుల వేదన. రోజూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటలు దాటేవరకూ బ్రేక్ దర్శనం కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్ వీఐపీల మాటెలా ఉన్నా కనీసం సిఫారసు లేఖలైనా కుదించడం లేదనే ఆరోపణలున్నాయి. వయోవృద్ధులు, చంటి బిడ్డల తల్లులు క్యూలో వేచి ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వల్ప తోపులాటలు కూడా జరుతున్నాయి.
వీఐపీ సేవలకు టీటీడీ పరిమితం
వీఐపీల ఒత్తిళ్లకు లోబడి రోజుకు 3 వేల నుంచి 4 వేల లోపు టిక్కెట్లను జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. తమకు సంబంధించిన వారు వచ్చినా సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి మరీ టిక్కెట్లను పొందుతున్నారు. శని, ఆది వారాలలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నియంత్రించలేకపోతున్నారు. వారానికి ఒకటి లేదా రెండు సిపారసు లేఖలను అనుమతించాల్సిన అధికారులు రోజూ అనుమతిస్తున్నారు. బోర్డు చైర్మన్, సభ్యులకు కోటాలో వందల టిక్కెట్లు, ప్రజాప్రతినిధులకు రోజుకు రెండు లేఖలపై టికెట్లను ఇస్తున్నారు. ఇతర అధికారులకు మరికొన్ని ఇవ్వడంతో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా సమయం కాస్తా వారికే సరిపోతోంది. సామాన్య భక్తుల దర్శన సమయం కుదించి మరీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్నాయి. 3,500 వీఐపీ టికెట్లను జారీ చేస్తే 3 నుంచి 4 గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. 4 గంటల వ్యవధిలో 3 వేల నుంచి 4 మంది వీఐపీలు దర్శించుకొనే సమయంలో సామాన్య భక్తులు 15 వేల మందికి పైగా దర్శించుకుంటారు. ఇప్పటికైనా రద్దీ రోజులను దృష్టిలో పెట్టుకుని బ్రేక్ దర్శనాలను నియంత్రించి సర్వదర్శనం వేళ ఎక్కువగా ఉండాలని సామాన్య భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment