వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి సూచించారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి సూచించారు. ఇక్కడి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు అధికారులు సమ్మెలో ఉన్నందున రిటైర్డ్ తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.
సమ్మెలో లేని ఉద్యోగులు, అధికారుల సేవలను వినియోగించుకుని దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. డీఆర్‌డీఏ, డ్వామా నుంచి తహశీల్దార్ స్థాయి అధికారి వరకు విధుల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా అధికారుల జాబితాలు విజయవాడ సబ్ కలెక్టర్‌కు ఇస్తే ఆమె విధులు కేటాయిస్తారని కలెక్టర్ డీఆర్‌వోకు సూచించారు. ఇరిగేషన్‌లో కొత్తగా జాయిన్ అయిన సిబ్బందిని, రిటైర్డ్ కు దగ్గర్లె ఉన్నవారితో దసరా ఉత్సవాల విధులు నిర్వర్తించాలని కలెక్టర్ చెప్పారు.
గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పై విధంగా ప్రణాళిక ప్రకారం సిబ్బందిని నియమించాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎల్. విజయచందర్, సబ్-కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లాయువజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ గంగయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సరసజాక్షి, డీఎస్‌వో సంధ్యారాణి పాల్గొన్నారు.