
తండ్రికి తనయ తలకొరివి
అంబాజీపేట : నిండు జీవితాన్ని గడిపి, పండుటాకులా రాలిపోయిన ఆయనకు తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడం ఓ లోటని అంతా భావించారు. అయితే.. పెద్ద కుమార్తె ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసి తండ్రి రుణం తీర్చుకుంది. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు మాజీ సర్పంచ్ యనమదల శ్రీరామమూర్తి(93) బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జిల్లా ఎక్సైజ్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమార్తె హేమ సీతామహాలక్ష్మి తానే అంత్యక్రియలు నిర్వహించి, తలకొరివి పెట్టింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు మణికుమారి, ఉషారాణి అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు. శ్రీరామమూర్తి 1956లో పుల్లేటికుర్రులో మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఆ పదవిని చేపట్టిన ఆయన గ్రామాభివృద్ధికి పాటు పడ్డారు. స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నట్టు బంధువులు తెలిపారు. ఆయన మృతి పట్ల సర్పంచ్ కాండ్రేగుల గోపాలకృష్ణ, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, బీజేపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు.