యాలాల, న్యూస్‌లైన్: నవమాసాలు మోసి కనిపెంచింది.. తాను పస్తులున్నా కూతురికి కడుపునిండా అన్నం పెట్టింది. రెక్కలుముక్కలు చేసుకొని ఆ మూతృమూర్తి కుమార్తెను పెంచి పెద్ద చేసింది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు సపర్యలు చేసి కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురు కొట్టి చంపేసింది. అనంతరం భర్తతో కలిసి మృతదేహాన్ని కాగ్నా నదిలో పడేసింది. నెలరోజులుగా ఆ తల్లి కనిపించకపోవడంతో గ్రామస్తులు, బంధువులు గట్టిగా నిలదీయడంతో కుమార్తె అసలు విషయం చెప్పింది. హృదయాలను ద్రవింపజేసే ఈ సంఘటన మండల పరిధిలోని అగ్గనూరులో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి అంతమ్మ(65)కు కూతురు కిష్టమ్మ ఏకైక సంతానం. వృద్ధురాలికి గ్రామ శివారులో రెండు ఎకరాల పొలం ఉంది. 30 ఏళ్ల క్రితం మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఆశన్నను ఇల్లరికం తెచ్చుకొని కూతురు కిష్టమ్మతో వివాహం చేసింది. వీరికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కొన్నాళ్లుగా అంతమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. వయసు మీదపడడంతో చేతులతో నేలపై పాకుతోంది. ఇంట్లోనే తింటూ కాలం వెళ్లదీస్తోంది. నెల రోజుల క్రితం ఓ రాత్రివేళ అంతమ్మ అన్నం పెట్టమని కూతురును వేడుకుంది. ‘నిత్యం నీకు సపర్యలు చేయలేక చస్తున్నా’ అంటూ ఈసడించుకున్న ఆమె తల్లి అంతమ్మ చెంపలపై కొట్టింది. దీంతో అంతమ్మ అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణం విడిచింది. విషయాన్ని గమనించిన కిష్టమ్మ, ఆశన్న దంపతులు అర్ధరాత్రి వేళ మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని కాగ్నా వాగులో పడేసి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే ఉంటున్నారు. వీధిలో తచ్చాడుతూ అందరినీ ఆప్యాయంగా పలుకరించే అంతమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది.
రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన బంధువులు అంతమ్మ విషయమై ఆరా తీశారు. తాండూరు మండలంలోని బెల్కటూర్‌లో ఉండే బంధువు నాగమ్మ వద్ద ఉంటోందని కిష్టమ వారిని నమ్మించేయత్నం చేసింది. దీంతో అనుమానించిన బంధువులు, గ్రామస్తులు వెంటనే బెల్కటూరులో ఉండే నాగమ్మకు ఫోన్ చేశారు. అంతమ్మ తన వద్ద లేదని ఆమె చెప్పింది. శుక్రవారం గ్రామస్తులు కిష్టమ్మను గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిన ఆమె తల్లి ని చంపేసిన విషయం చల్లగా చెప్పింది. సర్పంచ్ విజయలక్ష్మి సమాచారంతో తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్‌ఐ నాగార్జున గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. కిష్టమ్మ, ఆశన్న దంపతులను విచారించగా నేరం అంగీకరించారు. అంతమ్మ మృతదేహం కోసం కాగ్నా వాగు పరిసరాల్లో సాయంత్రం వరకు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల క్రితం మండలంలో కురిసిన భారీ వర్షాలకు కాగ్నా వాగు భారీగా ఉప్పొంగడంతో మృతదేహం కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్గనూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కిష్టప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
అమ్మను చంపేసింది..
Published Sat, Oct 19 2013 12:52 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement