
ఉండవల్లి అరుణ్ కుమార్
రాజమండ్రి: ఇప్పటి వరకు ఏకాభిప్రాయం, మెజార్టీ అభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ప్రతి నిమిషాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. సభలో ఇంతమంది వ్యతిరేకించారు, ఇంతమంది మద్దతు పలికారు అనేది స్పష్టంగా తెలియాని చెప్పారు. చర్చలో అన్ని అంశాలు చర్చకు రావాలన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే రాష్ట్రాల విభజన జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే రెండు రాష్ట్రాలు విలీనం అయ్యాయన్నారు. గతంలో కమిషన్ ద్వారా గానీ, అసెంబ్లీ తీర్మానం ద్వారా గానీ రాష్ట్రాల విభజన జరిగిందని చెప్పారు.
రాష్ట్ర విభజన అంశం పార్టీలకు సంబంధించినది కాదన్నారు. పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని చూడాలని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో విభజన జరగాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న సిడబ్ల్యూసిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్క సభ్యుడు కూడా లేరని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఇతర రాష్ట్రాలలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.