కంకిపాడు : పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తూ జిల్లా వాసులను మోసం చేస్తున్నారని, ఆయన్ను టీడీపీ నేతలు నిలదీయాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. కంకిపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తొలుత రాజధాని విజయవాడ అని ప్రకటించిన సీఎం.. మళ్లీ ఇప్పుడు గుంటూరు పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటుచేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులకు ఆశలు రేపి మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో భూ వ్యాపారం చేసుకుని, చివరికి మాట మార్చిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. టీడీపీ 150 రోజుల పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జాడలేదన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ పేరు తగిలించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై రోజులో మాట మారుస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన చంద్రబాబుకు ఈ విషయంలో అసలు చిత్తశుద్ధి లేదన్నారు. అధిక వడ్డీల బారిన పడ్డ రైతులను కాపాడిన ఆపద్బాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే, తిరిగి వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.
2న వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమావేశం
వైఎస్సార్‌సీపీ పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కంకిపాడు వాణీనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తామని సారథి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ బందరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరరవుతారని చెప్పారు.
పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మాదు వసంతరావు, వేల్పూరు సర్పంచ్ చెన్నుబోయిన జయరాం, మంతెన పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కంకిపాడు మాజీ సర్పంచ్ బండి నాంచారయ్య, ఏఎంసీ మాజీ డెరైక్టర్ భీమవరపు రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఉమా...ఓ చేతకాని దద్దమ్మ.. : సారథి
‘గుంటూరుకు రాజధాని.. దొనకొండకు పారిశ్రామిక కేంద్రం, విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటించి విజయవాడను మాత్రం డంపింగ్ యార్డుగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చేతకాని దద్దమ్మ మంత్రి ఉమా మాత్రం నోరు మెదపటం లేదు..’ అంటూ సారథి మండిపడ్డారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై రాద్ధాంతం చేసిన ఉమా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఉమా తన మంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబును నిలదీయాలని డిమాండ్ చేశారు.
జిల్లా వాసులను మోసగిస్తున్న బాబు
Published Fri, Oct 10 2014 2:14 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement