డీఏపై దయ తలుస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) మంజూరు చేసి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కరుణిస్తారా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. పదిహేను లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ మంగళవారం గవర్నర్ ఆమోదానికి పంపించింది. విభజన నేపథ్యంలో తొలుత ఆర్థిక శాఖ ఉన్నతాధికారి డీఏ మంజూరుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నెల 24వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి మంజూరు చేయాల్సిన డీఏ కూడా విభజనకు ముందే ఇవ్వాలని, ఈ విషయంలో గవర్నర్ చొరవ తీసుకోవాలని ఉద్యోగులు కోరిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ వార్తలతో డీఏ ఫైలుకు ఆర్థిక శాఖలో కదలిక వచ్చింది. జీతాలు ముందుగా ఇస్తున్నందున డీఏ కూడా ఇచ్చేయాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చా రు.
దీంతో సంబంధిత ఫైలును గవర్నర్‌కు పంపారు. ఆ ఫైలుకు గవర్నర్ ఓకే చెబితే.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసిన తొలి గవర్నర్‌గా నరసింహన్ రికార్డు సృష్టిస్తారు. ఆ ఫైలుకు ఆమోదం లభిస్తే గత జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులకు 8.56 శాతం డీఏ మంజూరు కానుంది.