ఎట్టకేలకు డీఏ వచ్చేసింది
ఎట్టకేలకు డీఏ వచ్చేసింది
Published Thu, May 15 2014 1:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
గవర్నర్ జోక్యంతో జీవో జారీచేసిన అధికారులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.5 శాతం కరువు భత్యం పెంపు
63.344% నుంచి 71.904 శాతానికి పెరిగిన డీఏ..
జనవరి 1 నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీఏ పెంపునకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేసిన తర్వాత కూడా ఆర్థికశాఖ ఆ ఫైలును తొక్కిపట్టిందంటూ ‘సాక్షి’ బుధవారం వార్త ప్రచురించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డీఏ ఫైల్‌ను తొక్కిపట్టిన అధికారులపై గవర్నర్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు వెంటనే డీఏ పెంపు జీవో జారీకి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చివరి డీఏ. రాష్ట్రపతి పాలనలో డీఏ పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం చరిత్రాత్మకమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కాగా, డీఏ పెంపునకు గవర్నర్ ఆమోదం తెలిపారని, ఫలితంగా 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు జరుగుతుందని గవర్నర్ కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
63.344 శాతం నుంచి 71.904 శాతానికి పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.5 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 63.344 శాతం నుంచి 71.904 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈనెల 24నే అందనున్న మే నెల జీతంతోపాటు పెరిగిన డీఏని ఉద్యోగులకు చెల్లించనున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులకు ఎస్‌పీఎఫ్ (స్టేట్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాల్లో వేయనున్నారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ‘చందాతో కూడిన పెన్షన్ పథకం’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతాలో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 31న లేదా అంత కంటే ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మొత్తం డీఏ బకాయిలను నగదు రుపంలోనే చెల్లిస్తారు. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 163.908 శాతం నుంచి 179.922 శాతానికి పెంచనున్నారు. 1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు 172.598 శాతం నుంచి 186.504 శాతానికి డీఏ పెరగనుంది.
ఐదో జ్యుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 183 శాతం నుంచి 200 శాతానికి, పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 90 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నారు. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ.100 పెరగనుంది. పెన్షనర్లకు కూడా ఈ మేరకు కరవు భృతి (డీఆర్) పెరుగుతుంది. ఉద్యోగులు డీఏ బకాయిల వివరాలను నిర్దేశిత పత్రంలో సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. డీఆర్ పెంపు జీవో ఒకట్రెండు రోజుల్లో వెలువడనుంది.
Advertisement