కరెంట్ కష్టాలకు చెక్ | decision to creation of two substations in parigi | Sakshi
Sakshi News home page

కరెంట్ కష్టాలకు చెక్

Published Sun, Feb 16 2014 1:20 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

decision to creation of two substations in parigi

పరిగి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు చికాకుపరుస్తున్న తరుణంలో పరిగి ప్రాంతంలో రెండు సబ్‌స్టేషన్లు ఏర్పాటు కానుండటంతో కరెంట్ కష్టాలు తీరుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాంతం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతుందన్న ఆశలు వారిలో రేకెత్తుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పరిశ్రమలను దూరప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో పరిగి ప్రాంతంలో 230, 400 కేవీ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

 పరిగికి ఇప్పటికే 230 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు కాగా, ఇందుకోసం ప్రభుత్వం భూమిని సైతం కొనుగోలు చేసి సంబంధిత శాఖకు అప్పగించింది. నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు సైతం కేటాయించింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి కావటంతో సంబంధిత కాంట్రాక్టర్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్రస్తుతం 230కేవీ సబ్‌స్టేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరలో ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రానుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే పరిగికి 400కేవీ సబ్‌స్టేషన్ సైతం మంజూరు కాగా గత సంవత్సరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు.

 ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.350 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. 400కేవీ సబ్‌స్టేషన్ కోసం పలుచోట్ల అధికారులు ప్రభుత్వ  భూమిని పరిశీలించినప్పటికీ అవసరమున్న విధంగా భూమి లభించలేదు. దీంతో ప్రభుత్వం రూ.9కోట్లతో ప్రైవేటు భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది.

 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం
 పరిగి ప్రాంతంలో ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నందున ఈ రెండు సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు వీలౌతుంది. పశ్చిమ జిల్లాలో వికారాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు 111 జీఓ అడ్డుగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు పరిగి ప్రాంతాన్ని ఎన్నుకోవడం అనివార్యంగా మారింది. ఇప్పటికే పరిగి మీదుగా హైదరాబాద్ - బీజాపూర్ అంతరాష్ట్ర రహదారి ఉండటం, దీన్ని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినందున రవాణా సౌకర్యం మరింత మెరుగుపడి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మారనుంది.

 పశ్చిమరంగారెడ్డితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
 పరిగి ప్రాంతంలో ఈ రెండు సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో పశ్చిమ రంగారెడి ్డజిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్, కోస్గి, షాద్‌నగర్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాల పరిధిలో 400కేవీ సబ్‌స్టేషన్ లేనందున కర్ణాటకలోని రాయ్‌చూర్ నుంచి ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

 ఇక్కడ 400కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు నుంచి నేరుగా పరిగి సబ్‌స్టేషన్‌కు, ఇక్కడినుంచి మిగతా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. ఇది పూర్తై ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోపాటు భవిష్యత్తులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలవుతుందని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement