విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి
ఉలవపాడు : విద్యుత్ కోతలపై ఆగ్రహించిన రైతులు, ప్రజలు మంగళవారం రెండు సబ్‌స్టేషన్లను ముట్టడించారు. ఈ సంఘటనలు అలగాయపాలెం, నలదలపూరులో చోటుచేసుకున్నాయి. చీటికీమాటికీ కోతలు విధిస్తుండడంతో ఓపిక నశించిన జనం, రైతులు అలగాయపాలెం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ హరికృష్ణను కూడా నిర్బంధించారు.
కొంత కాలంగా రాత్రిపూట త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడంపై రైతులు, గ్రామంలో ఎప్పుడుపడితే అప్పుడు కోతలు విధిస్తుండడంపై అలగాయపాలెం వాసులు ఆగ్రహించి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలతో నరకం చవిచూస్తున్నామని సబ్‌స్టేషన్ ఉద్యోగులను నిలదీశారు. దీంతో ఉద్యోగులు ఏఈకి సమాచారం అందించారు. ఏఈ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్య పరిష్కారంపై సంతృప్తికర సమాధానం రాకపోవడంతో ప్రజలు ఏఈ, సిబ్బందిని సబ్‌స్టేషన్‌లో ఉంచి గేటుకు తాళం వేశారు. తమ పరిధిలో ఏమీలేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని ఏఈ చెప్పుకొచ్చారు.
డీఈ జయకిషోర్ తనకు ఆదేశాలు ఇస్తారని, నేను నా కింది ఉద్యోగులకు చెబుతానని వివరించారు. ఇక్కడి ఉద్యోగులకు ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమిటని రైతులు నిలదీశారు. దీంతో ఏడీతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఈ హామీ ఇచ్చారు. అక్కడి నుంచే రైతుల సమస్యను ఫోన్‌లో ఏడీకి తెలియజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.
పత్తి రైతుల కన్నెర్ర
వలేటివారిపాలెం : వేళాపాళాలేని విద్యుత్ కోతలతో విసుగు చెందిన రైతులు మంగళవారం నలదలపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సిబ్బందిని రెండు గంటల పాటు నిర్బంధించారు. కలవళ్లకు చెందిన వంద మంది పత్తి రైతులు ఉద యం 7 గంటలకు సబ్ స్టేషన్‌కు చేరుకుని ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కోతలు ఆపకుంటే రోజూ సబ్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కనీసం 4 గంటలైనా సక్రమంగా విద్యు త్ సరఫరా చేయాలని రైతులు నినాదాలు చేశారు.
కుర్చీలు, పాత మీటర్లు ధ్వంసం
విద్యుత్ అధికారుల తీరుకు నిరసనగా సబ్ స్టేషన్‌లోని కుర్చీలు, పాత మీటర్లను రైతులు ధ్వంసం చేశారు. పంటలు పండక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అధికారులే బాధ్యత వహించాల్సిఉంటుందని మండి పడ్డారు. అనంతరం అక్కడికి వచ్చిన ఏఈ రాఘవేంద్రరావు రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్లే కోతలు విధించాల్సివస్తోందని చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఏ సమయంలో విద్యుత్‌ను ఇచ్చేది రెండు రోజుల్లో వేళలను నిర్ణయించి ఆ మేరకే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెనుదిరిగారు.