బడి బోసిపోతుంది
- పర్యవేక్షణా లోపం
- తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
- ఎంఈవో పోస్టులు ఖాళీ
- నిధులున్నా...సౌకర్యాలు సున్నా
ప్రజాప్రతినిధుల పట్టించుకోనితనం, ఉన్నతాధికారుల అలక్ష్యం, విద్యాశాఖాధికారుల పర్యవేక్షణాలోపం వెరసి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమై పోతున్నాయి. ప్రజలకున్న ‘ఇంగ్లిష్ మోజు’ను పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మచిలీపట్నం : ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి. అన్నీ అర్హతలున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నా ఈ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు.
ప్రతి ఏటా ఆగష్టు 31వ తేదీ నాటికి ఐదేళ్లు నిండిన బాలలనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలనే పాతకాలపు నిబంధన ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీల పేరుతో వయసుతో సంబంధం లేకుండా పిల్లలను పాఠశాలల్లో చేర్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సదుపాయం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా విద్యాశాఖకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధం లేకపోవడంతో సమన్వయం కుదరడంలేదు.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1752, ప్రాథమికోన్నత పాఠశాలలు 409, ఉన్నత పాఠశాలలు 393 ఉన్నాయి. వీటిలో 2013-14 విద్యాసంవత్సరంలో 6,70,483 మంది విద్యార్థులు చదివినట్లు విద్యాశాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవటంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందనే వాదన వినబడుతోంది. ఏడాదిలో 300 రోజులు ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తుండగా ప్రభుత్వ పాఠశాలలు 200 రోజులు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 45శాతం మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల నియామకం నిలిచిపోయింది. దీంతో ఈ పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. పదేళ్ల క్రితం సీఎస్‌ఐ పాఠశాలల్లో 600 మంది ఉపాధ్యాయులు పనిచేయగా నేడు ఆ ఉపాధ్యాయుల సంఖ్య 80కు చేరుకోవడం గమనార్హం.
కారణాలు ఇవేనా :
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయులే కారణమనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలోని అధిక మండలాల్లో ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జ్ ఎంఈవోల పాలన కొనసాగుతోంది. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్ నుంచి కోట్లాది రూపాయలు నిధులు విడుదలవుతున్నా వాటిని సక్రమంగా వినియోగించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ద్వారా నడిచే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల వద్దే నిర్వహించి విద్యార్థులను పాఠశాల వాతావరణానికి అలవాటు చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మౌలిక వసతులేవీ?
పాఠశాలల్లో తరగతిగదులు, మంచినీటి వసతి, ప్రహరీ, ఆటస్థలం, మరుగుదొడ్లు, వంటగది, ఫర్నిచర్, ఆటవస్తువులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విద్యుత్‌సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. అయితే తరగతి గదులు లేక తాటాకు గుడిసెల్లోనూ, వరండాల్లోనూ, అద్దె భవనాల్లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి.
రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఒక్కొక్క పాఠశాలకు ఏడాదికి రూ. 50వేలకు పైగా నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలో నియమ నిబంధనలు సూచించినప్పటికీ ఉపాధ్యాయులు వీటిని ఖర్చు చేయకుండా వెనక్కి పంపే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఊసే ఉండదు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివే ఆడపిల్లల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గైనిక్ పరమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
మగపిల్లలు, ఆడపిల్లలకు వేరువేరు మరుగుదొడ్లు ఉండాలనే నిబంధన ఉండగా అసలు మరుగుదొడ్లు లేని పాఠశాలలు కొన్నయితే, నీటి వసతి లేకపోవటంతో మరుగుదొడ్లు ఉపయోగించని పాఠశాలలు 60శాతానికి పైగా ఉన్నాయి. 2010 ఏప్రిల్ నుంచి ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా పాఠశాలలో మౌలిక వసతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా వివిధ సంవత్సరాల్లో జిల్లాలోని ఒక్కొక్క పాఠశాలకు విడుదలైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నిధులతో పాఠశాలల్లోని ల్యాబ్‌లలో సైన్ పరికరాలు, రసాయనాలు, గ్రంథాలయంలో పుస్తకాలు, విద్యుత్, ఇంటర్‌నెట్ బిల్లులు, ఆట వస్తువులు, తాగునీటి వసతి కోసం చిన్న, చిన్న రిపేర్లు తదితర పనులు చేసుకోవచ్చు. ఏ పనికి ఎంత నిధులు వినియోగించాలో నిధులు విడుదల చేసే సమయంలోనే సూచిస్తారు.