బాధ్యతలు స్వీకరిస్తున్న దీపిక పాటిల్
సాక్షి, కర్నూలు : జిల్లా అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక పాటిల్, నంద్యాల ఓఎస్డీగా ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇక్కడ ఏఎస్పీగా ఉన్న ఆంజనేయులును నంద్యాల ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ స్థానంలో తిరుపతి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న దీపిక పాటిల్‌ను నియమించింది. ఇద్దరూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు ఈ ఏడాది మార్చి 8న విధుల్లో చేరారు. ఐదు నెలల పాటు అడిషనల్ ఎస్పీగా పనిచేసి.. నూతనంగా నియమితులైన దీపిక పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈమె 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత బదిలీపై కర్నూలుకు వచ్చారు. ఈమె భర్త విక్రాంత్‌పాటిల్ గుంతకల్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. దీపికపాటిల్ తండ్రి వెంకటేశ్వరరావుది కృష్ణా జిల్లా ఆముదాల లంక. ఆయన సీఆర్‌పీఎఫ్‌లో ప్రస్తుతం ఐజీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.
సాంకేతిక సేవలను విస్తృతం చేస్తాం
జిల్లా పోలీసు శాఖలో సాంకేతిక సేవలను మరింత విస్తృతం చేసి.. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని దీపికపాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సహకారంతో పోలీసు సిబ్బందికి సంబంధించి పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తినా తగిన చర్యలు చేపడతామన్నారు. అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ , డీఎస్పీలు వెంకటాద్రి, ఇలియాజ్ బాషా, ఏఓ సురేష్‌బాబు, ఆర్‌ఐలు జార్జ్, రామకృష్ణ, రవి, రంగస్వామి తదితరులు ఏఎస్పీ దీపికపాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. దీపికపాటిల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప, డీఐజీ వెంకట్రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment