జింకలున్నాయా...
♦ కంబాల కొండ, సీతకొండపై కానరాని సందడి
♦ హుద్‌హుద్ తుపాను తరువాత కనిపించని జాడ
సాగర్‌నగర్ : విశాలమైన అటవీప్రాంతంగా పిలిచే కంబాలకొండ, సీతకొండ ప్రాంతాల్లో జింకల జాడ కానరావడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో జింకలు గుంపులుగా చెంగుచెంగున గెంతుతూ సందర్శకులను కనివిందు చేసేవి. పచ్చిక మేత కోసం జాతీయరహదారిపైకి వచ్చి వాహనచోదకులకు వినోదం కలిగించేవి. ఇప్పుడు ఆ గుంపులు కనిపించడం లేదు. జాతీయ రహదారిని ఆనుకుని పచ్చిక చిగుళ్లు కనిపిస్తున్నా జింకలు కానరావడం లేదు. ఆ జింకలు ఎమయ్యాయి..? అసలు అవి ఉన్నాయా..? హుద్‌హుద్ తుపాను సమయంలో మృతిచెందాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో డెయిరీఫారం నుంచి జూ పార్కు మీదుగా ఎండాడ వరకు గల జాతీయరహదారి ప్రాంతానికి పచ్చిక మేతకోసం సాయంత్రం, ఉదయం వేళల్లో జింకలు తరచూ వస్తుండేవి. మేత అనంతరం కంబాలకొండ కొలనులో నీళ్లు తాగి అడవులోకి పరుగుతీస్తుండేవి. అటవీప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన జింకలు జాతీయ రహదారిని దాటుతున్న సమయంలో వాహనాలు ఢీకొని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. సీతకొండల నుంచి జూ పార్కులోకి గుంపులుగా దిగిన జింకలు అడవి దున్నలు, కనుజులకు జూ సిబ్బంది వేసిన మేతను తిని మళ్లీ కొండలెక్కేస్తుండేవి. ఇవన్నీ హుద్‌హుద్ తుపానుకు ముందు పరిస్థితి.
ఉంటే.. కనిపించేవి!: కొండల్లో జింకలు ఉన్నట్లయితే ఎప్పటిలాగే కనిపించేవి..హుద్‌హుద్ తుపాన్‌కు ముందు కంబాలకొండ చుట్టూ కొన్ని చోట్ల అటవీప్రాంతం నుంచి బయటకు రాకుండా కంచె నిర్మించారు. ఆ కంచె మధ్య ఖాళీలను దారులుగా చేసుకొని జింకలు బయటకు వచ్చేస్తుండేవి. తుపాను దాటికి కంబాలకొండ చుట్టూ ఉన్న కంచె పూర్తిగా మాయమైంది. ఇనుప తీగలు దెబ్బతినడంతో కొండచుట్టూ రక్షణ కవచం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో జింకలు బయటకు రాకపోవడంతో అసలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నలు జంతు ప్రేమికుల్లో తలెత్తుతున్నాయి.