నేరాల్లో డిగ్రీ!
డిగ్రీ చదివాడు. ఆర్మీ ఉద్యోగం కూడా సంపాదించాడు.. కానీ వ్యసనాలు అతన్ని పతనం చేశాయి. ఘరానా మోసగాడిగా మార్చాయి. మత్తు పానీయాలు ఇచ్చి మహిళలను లోబరచుకోవడం, ఆనక బంగారు నగలతో ఉడాయించడం.. ఆర్మీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగలను ముంచడం.. యథేచ్ఛగా చోరీలకు పాల్పడటంతోపాటు హత్యలకు తెగబడటం ద్వారా ఆ యువకుడో ఘరానా నేరగాడిగా మారాడు.
పాలకొండ రూరల్:సోమవారం ఉదయం.. విశాఖపట్నం నుంచి పాలకొండకు వెళ్లేందుకు ఓ మహిళ బస్సు ఎక్కింది. అప్పటికే బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు తన పక్క ఖాళీగా ఉన్న సీటులో కూర్చోమన్నాడు. మిగతా సీట్లు నిండిపోవడంతో ఆమె అతని పక్క సీట్లో కూర్చుంది. ఆ ప్రయాణికుడు మెల్లగా ఆమెతో మాటలు కలిపాడు. తనది కూడా పాలకొండేనని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్దనున్న కూల్‌డ్రింక్ ఇచ్చాడు. మొహమాటంతో ఆమె తీసుకొని తాగింది.
అప్పటికే అందులో నిద్రమాత్రలు కలిపి ఉండటంతో మత్తులోకి జారుకుంది. వెంటనే ఆగంతకుడు తన పని కానిచ్చేశాడు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలు చేజిక్కుంచుకొని బస్సు దిగి వెళ్లిపోయాడు. కొంత సేపటికి తేరుకున్న ఆ మహిళ జరిగిన మోసాన్ని గ్రహించి పాలకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఆధారాల ప్రకారం వేట సాగించిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతను చెప్పిన వివరాలు విని విభ్రాంతికి గురయ్యారు. అతడు గుండెలు తీసిన బంటని అర్థమైంది. హత్యలు, అత్యాచారాలు, చోరీలు, మోసాలు అతనికి నిత్యకృత్యమని.. అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
చదువుతోపాటే వ్యసనాలు
పోలీసులు అరెస్టు చేసిన ఈ ఘరానా మోసగాడి పేరు కొట్టిశ లక్షుంనాయుడు. వీరఘట్టం మండలం వండువ స్వగ్రామం. డిగ్రీ వరకు చదివిన నాయుడు.. చదువుకుంటున్నప్పుడే వ్యసనాలకు బానిసయ్యాడు. విలాసాలు మరిగి చిన్న చిన్న మోసాలకు పాల్పడేవాడు. చదువు పూర్తి అయిన తర్వాత ఆర్మీ ఉద్యోగం సంపాదించినా వ్యసనాలు, నేరాలతో దాన్ని దూరం చేసుకున్నాడు. ఒక సందర్భంలో జైలుకు వె ళ్లగా అక్కడ కొందరు చోరీ కేసు నిందితులతో ఏర్పడిన పరిచయాలు.. అతని నేరచరిత్రను మరోమలుపు తిప్పాయి.
నేరాల చిట్టా ఇదీ..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం లక్షుంనాయుడు నేరాల చిట్టా చాంతాండంత ఉంది..
2006లో ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు స్వగ్రామమైన వండువలోనూ పలువురు నిరుద్యోగులను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బుతో ఉడాయించాడు. చివరికి విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేటలో అరెస్టయ్యాడు. వివాహం చేసుకున్న నాయుడు వివాహానంతరం కుటుంబ సభ్యులనూ మోసం చేశాడు. 2005లో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ సంస్థ యజమాని నుంచి రూ.1.50 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని యజమాని ఒత్తిడి చేయడంతో అతన్ని మెళియాపుట్టి మండలం పెద్దమడి వద్ద క్లచ్ వైరుతో ఉరి వేసి హతమార్చాడు. మృతదేహాన్ని పెద్దపాడు కాలువలో పడవేశాడు.
2010లో ఏలూరులో జరిగిన ఓ హత్య కేసులో లక్షుంనాయుడు పాత్ర కీలకమైనదని పోలీసులు చెప్పారు.
ఇదే ఏడాది ఒక అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. వారితో మాటలు కలిపి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి.. వారిలో ఒంటిపై ఉన్న ఆభరణాలు చోరీ చేసేవాడు. వీలైతే వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. 2013లో పాలకొండలో రెండు, టెక్కలిలో ఒకటి, రాజాంలో ఒక ఇంటిలో చొరబడి బంగారం, వెండి ఆభరణాలను కూడా దొంగలించినట్టు విచారణలో వెల్లడైంది. సుమారు 25 తులాల వెండి, 19 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు లక్షుంనాయుడు అంగీకరించాడు. అతని నుంచి 8 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
తస్మాత్ జాగ్రత్త
లక్షుంనాయుడును మీడియా ముందు ప్రవేశపెట్టిన పాలకొండ డీఎస్పీ దేవానంద్‌శాంతో మాట్లాడుతూ నేరగాళ్లు రోజురోజుకు పెచ్చిమీరిపోతున్నారని, ఈ నేపథ్యంలో మహిళలతో పాటు అన్ని వర్గాల వారు చైతన్యం వంతం కావాలన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, వారికి ఫోన్ నెంబర్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని, ఆ విధంగా ప్రవర్తించడం కారణంగానే లక్షుంనాయుడు వంటి నేరగాళ్లకు అవకాశం కల్పించినట్టవుతుందన్నారు. ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలో సీఐ మజ్జి చంద్రశేఖర్, ఎస్సై ఎల్.చంద్రశేఖర్‌తో పాటు క్రైమ్ విభాగం నుంచి గవరయ్య, రమేష్, గోవింద్ తదితరులు బృందాలుగా ఏర్పడి ఘరానా మోసగాడిని అదుపులోకి తీసుకున్నారని ప్రశంసించారు.