ధర్మవరం టౌన్ : డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిని పట్టపగలు కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. విద్యార్థిని పెద్దపెట్టున కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. శుక్రవారం ఈ ఘటన ధర్మవరం పట్టణంలో కలకలం రేపింది. పోలీసులకు భాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలో నివాసం ఉంటున్న శ్రీరామిరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె స్రవంతి స్థానిక శ్రీసాయి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
రోజులాగే శుక్రవారం ఉదయం సోదరుడు భాస్కర్‌రెడ్డి స్రవంతిని కళాశాల వద్ద డ్రాప్ చేసి వెళ్లాడు. కాసేపటి తర్వాత నోటు పుస్తకాలు కావలసి ఉండటంతో స్రవంతి.. ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని కళాజ్యోతి వద్ద ఉన్న బుక్‌స్టాల్ వద్దకు బయలుదేరింది. మార్గం మధ్యలో ఏఎస్పీ కార్యాలయం సమీపంలో సుమోలో వచ్చిన దుండగులు స్రవంతిని అటకాయించారు. మంకీ క్యాప్‌లు ధరించిన నలుగురు దుండగులు వాహనం మధ్య భాగంలోని డోర్‌ను తీసి స్రవంతిని బలవంతంగా చేయి పట్టుకుని సుమోలోకి లాగే ప్రయత్నం చేశారు.
భయంతో పెద్దపెట్టున కేకలు వేస్తూ.. పెనుగులాడి వారి పట్టు నుంచి విడిపించుకుంది. దీంతో భయపడిన దుండగులు సుమోను వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయారు. పెనుగులాటలో స్రవంతి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. భయం భయంగా కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా స్రవంతి వివరించింది. సోదరునితో కలసి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి శ్రీరామిరెడ్డి కుటుంబానికి, ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురంలో ఉండే రవీంద్రరెడ్డి, అతని కుమారుడు మారుతీ రెడ్డిల మధ్య పొలం విషయంలో వివాదం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్రవంతి సోదరుడు భాస్కరెడ్డిపై గత ఏడాది జరిగిన హత్యాయత్నం కేసులో మారుతి రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. వారితో తప్ప తమకు ఎవరితోనూ విభేదాలు లేవని ఫిర్యాదులో వివరించారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్‌భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ స్రవంతిని ఎవరో నలుగురు వ్యక్తులు మంకీ క్యాప్‌లు ధరించి కిడ్నాప్ చేయబోయారని చెప్పారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.
డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్‌కు విఫల యత్నం
Published Sat, Jan 24 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement
Advertisement