గుంతకల్లు రైల్వే జోన్ ఈ ప్రాంత వాసుల కల. రాష్ట్ర విభజన తర్వాత గుంతకల్లు జోన్ కోసం ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న (శుక్రవారం) ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ‘అనంత’ వాసులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రైల్వే అధికారులు కూడా డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. అయితే కేంద్రం ఎన్నింటిని పరిగణలోకి తీసుకుంటుంది...ఏ మేరకు నిధులు విడుదల చేస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
అనంతపురం, గుంతకల్లు : రానున్న రోజుల్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాల పెంపు, ట్రాక్ భద్రత, రైల్వే ఉద్యోగులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై గుంతకల్లు డివిజన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే రూ. వందల కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. అయితే రైల్వే శాఖ మాత్రం అవసరమైన ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
1.19 ఎకరాల్లో రైల్వే వాణిజ్య సముదాయం
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే వాణిజ్య సముదాయం ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నారు. గుంతకల్లులోని రైల్వే క్రీడా మైదానం ఆనుకొని ఉన్న 1.19 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
ఎల్‌సీ గేట్ల మూసివేతకు శ్రీకారం
ఇప్పటికే దాదాపు 116 కాపలా లేని ఎల్‌సీ గేట్లు ఎత్తివేసి భారతీయ రైల్వేలో గుంతకల్లు డివిజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే తరహాలో ప్రమాదరహిత రైల్వే డివిజన్‌గా గుంతకల్లును తీర్చిదిద్దడంలో భాగంగా కాపలా ఎల్‌సీ గేట్లు (మ్యాన్డ్ ఎల్‌సీ గేట్లు) మూసివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. డివిజన్ పరిధిలోని 30 ప్రాంతాల్లో మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయనీ, ఇందుకు గాను రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. అదే విధంగా ట్రాక్‌భద్రతకు రూ. 157 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో డివిజన్ వ్యాప్తంగా అవసరమైన 31 ప్రదేశాల్లో స్లీపర్స్, రెయిల్స్ ఏర్పాటు పనులు చేపట్టాలని భావించారు. డివిజన్ పరిధిలో 1,438 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లున్నాయి.
రైల్ ప్లైఓవర్‌కు ప్రతిపాదనలు
గుంతకల్లు జంక్షన్ సమీపంలోని మల్లప్పగేటు నుంచి నంచర్ల వరకు రైల్ ఫ్లై ఓవర్ ఏర్పాటుకు డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్‌లై ఓవర్ మధ్య దూరం ఎంత? ఎంతమేర నిధులు అవసరమువుతాయి? ఈ ప్‌లై ఓవర్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే బోర్డుకు వివరించారు. అదేవిధంగా గుంతకల్లు జంక్షన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలను, 3, 4 ప్లాట్‌ఫారాలతో కలిపేందుకు కూడా ప్రతిపాదనలు పంపారు.
ఉద్యోగులకు సౌకర్యాల కల్పనకు
వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగుల కుటుంబాలకు కనీస సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేసే చర్యలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని పది ప్రాంతాల్లో నూతనంగా స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటు, పాత క్వార్టర్ల మరమ్మతులకు రూ.54 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. గుంతకల్లు, తిరుపతి, రేణిగుంట, ధర్మవరం, డోన్, ముద్దనూరు, కడపలో టీటీఈ విశ్రాంత గదుల ఏర్పాటుకు, రాయచూరులో 60 పడకలతో రన్నింగ్ రూం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. భద్రతా చర్యల్లో భాగంగా రాయచూరులోని గూడ్స్ షెడ్‌ను యర్మరస్ తరలించేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
గుత్తి, అనంతపురం రైల్వేస్టేషన్లరూపురేఖలు మారేనా?
♦ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి గుత్తి, అనంతపురం, తాడిపత్రి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ముఖ్యంగా.. రూ.15 కోట్లతో అనంతపురం రైల్వేస్టేషన్ పశ్చిమ భాగాన నూతన భవనం ఏర్పాటుకు అనుమతులు కోరారు.
♦ ప్లాట్‌ఫారం–1 ఆధునికీకరణకు రూ. 8.65 కోట్లలు కేటాయించాలని కోరారు.
♦ గుత్తి రైల్వే జంక్షన్‌లో ఉన్న 2 ప్లాట్‌ఫారాలకు అదనంగా మరికొన్ని నిర్మించేందుకు,
♦ గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం, స్టేషన్ ప్రాంగణం అభివృద్ధికి రూ.2.37 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
♦ ప్రయాణికుల సౌకర్యార్థం గుత్తి జంక్షన్‌లో రూ.66 లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చారు.
♦ తాడిపత్రి రైల్వేస్టేషన్ అభివృద్ధి కోటి రూపాయలతో అంచనాలు.
♦ డివిజన్ పరిధిలోని చిత్తూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ 2.35 కోట్లు కేటాయించాలని కోరారు.
♦ రేణిగుంటకు రూ 1.60 కోట్లు, శ్రీకాళహస్తికి రూ 2.47 కోట్లు, రాయచూరు స్టేషన్ అభివృద్ధికి రూ 1.26 కోట్లతో ప్రతిపాదనలు.
♦ ధర్మవరం, డోన్, ఆదోని, మంత్రాలయంరోడ్డు రైల్వేస్టేషన్లలో ట్రైన్ ఇండికేషన్ బోర్డుల ఏర్పాటుకు రూ 3.75 కోట్లతో ప్రతిపాదనలు.
♦ తిరుపతి రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారాల కోసం రూ.76 కోట్లతో ప్రతిపాదనలు.
♦ తిరుపతి – వెస్ట్ తిరుపతి మధ్య ప్రత్యేక రైల్వే లైన్ కోసం రూ 19కోట్లు. ఈ పనుల్లో భాగంగా భూ సేకరణకు రూ.43 కోట్లు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఉన్నాయి.
భద్రత, మౌలిక వసతులకు పెద్దపీట
ప్రయాణికుల భద్రత, మౌలిక వసతుల కల్పన, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సిబ్బంది వసతి సదుపాయాలకు ప్రతిపాదనలు పంపాం. ఎంపీ, డీఆర్‌యూసీసీ సూచనలు, స్థానికుల వినతుల మేరకు కొత్త రైళ్లకూ ప్రతిపాదనలు పంపాం. డివిజన్‌లోని మేజర్ ప్రాజెక్టులంటికీ జోనల్ స్థాయి అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించాం. – విజయప్రతాప్‌సింగ్, డీఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment