గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి
పట్టణ బంద్ విజయవంతం
గుంతకల్లు టౌన్ : రైల్వే జోన్ సాధన కోసం సీపీఎం-సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం జిల్లా గుంతకల్లులో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఉదయాన్నే నాయకులు రోడ్లపైకి వచ్చి వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు సర్కిల్ నుంచి ఎన్‌టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నేత దశరథరెడ్డి మాట్లాడారు. భారతీయ రైల్వేలోనే ప్రసిద్ధి చెందిన గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రంలో జోన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం, సౌకర్యాలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విశాఖలో జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండటం సరికాదన్నారు. గుంతకల్లులో జోన్ ఏర్పాటు చేయడం వల్ల కరువు, కాటకాలతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రగతి పథంలో నడుస్తున్న రైల్వే డివిజన్‌కి తీవ్ర అన్యాయం జరుగుతున్నా నిలదీయాల్సిన జిల్లాకు చెందిన ఎంపీలు చేతకానితనాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. రైల్వే జోన్ సాధించే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ అనుబంధ సంఘాల నేతలు, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.