మొహం చాటేసిన ‘మార్క్‌ఫెడ్’ | Demonstrate face 'markphed' | Sakshi
Sakshi News home page

మొహం చాటేసిన ‘మార్క్‌ఫెడ్’

Published Sat, Oct 19 2013 4:48 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

Demonstrate face 'markphed'

జడ్చర్ల, న్యూస్‌లైన్: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు, పాలకవర్గం కనిపించకుండాపోయింది. కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ మోహం చాటేయడంతో ప్రభుత్వ మద్దతుధరలు దక్కుతాయని ఆశించిన రైతుకు భంగపాటు ఎదురైంది.

 వారంరోజలుగా మార్కెట్‌యార్డుకు బంద్ ప్రకటించి కొనుగోళ్లు నిలిపేయగా, గురువారం మార్కెట్‌లో క్రయవిక్రయాలను ఊపందుకున్నాయి. దీంతో రెండురోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా మొక్కజొన్న విక్రయానికి తరలొచ్చింది. అంతేగాక మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుందని స్వయంగా మార్కెట్ కమిటీ చెర్మైన్ రమేశ్‌రెడ్డి ప్రకటించడంతో మద్దతు ధరలు దక్కుతాయన్న ఆశతో రైతులు ఇక్కడికి వేలకొద్దీ బస్తాల మొక్కజొన్నను తీసుకొచ్చారు.
 
 గురువారం 21,380 బస్తాలు, శుక్రవారం మరో 26,350 బస్తాలు మార్కెట్‌కు విక్రయానికి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. అయితే క్వింటాలుకు గరిష్టంగా రూ.1233, కనిష్టంగా రూ.1000 ధరలు పలికినట్లు వారు పేర్కొన్నారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు అసంతృప్తితోనే వెనుదిరగాల్సి వచ్చింది. గురువారమే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న అధికారులు శుక్రవారం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో తాము ఎంతో ఆశపడి మొక్కజొన్నను మార్కెట్‌కు తీసుకొచ్చామని, తీరా మార్క్‌ఫెడ్ జాడేలేదని అన్నదాతలు పెదవివిరిచారు. వారం రోజులుగా మొక్కజొన్నను ఎండబెట్టినా మద్దతుధరలు దక్కకపోవడం శోచనీయం. ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 
 అయోమయంలో పత్తి రైతు
 అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అనే చందంగా మారింది పత్తిరైతు పరిస్థితి. సాగు ప్రారంభంతో విత్తనాలు, ఎరువులు..ఆ తరువాత తెగుళ్ల బెడద.. తీరా పంటకొచ్చే సమయంలో ఆశించిన ధరలు లేకపోవడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పత్తి క్వింటాలుకు కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలైనా దక్కే నా? అని కలవరం మొ దలైంది. జిల్లాలో ఈ ఏ డాది 1.84లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. ఎకరా సాగుకు విత్తనాలు,ఎరువులు, పు రుగు మందులు, కూలీ ల ఖర్చులు కలిపి ఒక్కో ఎకరాపై రూ.20వేల వరకు వెచ్చించారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాల్సి ఉండగా, కనీసం ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్లకు మించి దిగుబడిరావడం లేదు. ఇదిలాఉండగా పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర తక్కువగానే ఉంది. గతేడాది ధరలతో పోల్చితే ఈ ఏడాది పత్తి క్వింటాలుకు ప్రభుత్వం పెంచిన మద్దతుధర కేవలం రూ.100 మాత్రమే ఉంది. దీంతో గరిష్ట మద్దతుధరగా రూ.4000, కనిష్టంగా రూ.3800 పలుకుతుంది.  జిల్లాలో పేరుగాంచిన బాదేపల్లి పత్తి మార్కెట్‌లో ఈనెల 23వ తేదీ నుంచి పత్తి క్రయవిక్రయాలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది బాదేపల్లి మార్కెట్‌లో 2.10 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ఇదే మార్కెట్ పరిధిలో నాఫెడ్ ద్వారా 1.50లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఈ మార్కెట్ పరిధిలో సుమారు రూ.136కోట్ల పత్తివ్యాపారం జరిగింది.
 
 దళారుల రంగప్రవేశం
 పత్తి కొనుగోళ్లకు సంబంధించి మధ్య దళారులు అప్పుడే రంగప్రవేశం చేశారు. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోళ్లు చేసేందుకు ఇప్పటికే రైతులకు కొంత నగదు ముట్టజెప్తున్నారు. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు రైతుల నుంచి నాణ్యత గల పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
 
 జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే వందలారీలకు పైగా పత్తిని కొనుగోలుచేశారు. ఇదిలాఉండగా తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ప్రభుత్వ రంగసంస్థలైన సీసీఐ, నాఫెడ్ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే జిల్లాలో షాద్‌నగర్ మినహా ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రం లేదు. గతేడాది జడ్చర్లలో మాత్రం నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ మద్దతుధరలకు కొనుగోళ్లు జరిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement