
డెంగీ మరణాలు దడ పుట్టిస్తున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో అత్యధికమంది చిన్నారులే ఉంటున్నారు. పారిశుద్ధ్య లోపంతోనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. అయినా అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపరచడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలపై చర్యలు చేపట్టడం లేదు.
అనంతపురం: జిల్లాలో శనివారం డెంగీ జ్వరాలతో నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహాళ్ మండలం మడేనహళ్లికి చెందిన పంపాపతి, లింగమ్మ దంపతుల కుమారుడు నవీన్ (10 నెలలు) రుద్రయ్య, లక్ష్మక్క దంపతుల కుమారుడు ఓబుళస్వామి(7)లకు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో స్థానికంగా వైద్యులకు చూపించారు. అయినా తగ్గకపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు డెంగీ అని తేల్చారు. ఇద్దరు చిన్నారులూ చికిత్స పొందూతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఇదే గ్రామానికి చెందిన సంజీవప్ప, లక్ష్మి దంపతుల కుమారుడు పరశురాం (8నెలలు)కు శనివారం ఉదయం జ్వరంగా ఉండడంతో బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయంత్రం మృతిచెందాడు. డెంగీ లక్షణాలతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మడనేహళ్లికే చెందిన వన్నూరప్ప (55) కూడా చనిపోయాడు. ఈయన జ్వరంతో చనిపోయాడా.. డెంగీతోనా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. పంపాపతి, లింగమ్మ దంపతుల పెద్ద కుమారుడు నరసింహులు(6)కు కూడా తీవ్ర జ్వరం రావడంతో చిన్న కుమారుడు నవీన్‌ను ఖననం చేసి, హుటాహుటిన బెంగళూరు ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
తాడిపత్రిలో కానిస్టేబుల్ కుమార్తె..
తాడిపత్రి టౌన్: తాడిపత్రిలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న కానిస్టేబుల్ మారుతి కుమార్తె వైష్ణవి(7) శనివారం డెంగీ జ్వరంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మారుతికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె వైష్ణవి ప్రయివేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుతోంది. చికిత్స చేయించినా తగ్గకపోవడంతో శనివారం ఉదయం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వారి సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యంలోనే వైష్ణవి మృతి చెందింది. చిన్నారి మృతికి సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఆంజనేయులు, శివప్ప, కానిస్టేబుళ్లు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment