కరవాకలో డెంగీ జ్వరాలు
Published Tue, Aug 20 2013 5:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
కరవాక (మామిడికుదురు), న్యూస్‌లైన్ : సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో 12 మందికి డెంగీ జ్వరం సోకినట్టు నిర్ధారణ అయిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.పద్మావతి స్పష్టం చేశారు. గ్రామంలో గత మూడు వారాలుగా జ్వరాలు ప్రబలి, గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్న విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ పద్మావతి సోమవారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఇంతవరకూ 188 జ్వరం కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటి లో 21 కేసులకు సంబంధించిన నమూనాలను పరీక్షలకు పంపగా 12 కేసులు డెంగీ జ్వరాలుగా నిర్ధారణ అయ్యాయని చెప్పారు.
మిగి లిన కేసులు మలేరియా, టైఫాయిడ్, కామెర్ల వ్యాధులకు సంబంధించినవన్నారు. డెంగీ బారిన పడినవారు ప్రస్తుతం కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రాజోలు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. డెంగీ వ్యాధి నివారణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్ ప్రారంభించామని, ఈ పక్రియ ఎనిమిది వారాలు కొనసాగుతుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారు మధ్యలో చికిత్స మానకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. దీనిపై కరపత్రాల ద్వారా గ్రామస్తులను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రాజోలు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, వ్యాధి నిర్ధారణ కొరకు ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. డెంగీ జ్వరాలపై ఆందోళన అవసరం లేదన్నారు.
దోమల నిర్మూలన చర్యల్లో భాగంగా గ్రామంలో ఎబేట్ మందును పిచికారీ చేయడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు బ్లీచింగ్ చల్లిస్తున్నామన్నారు. కాగా జోనల్ మలేరియా అధికారి జేవీ ప్రసాదబాబు, ఎస్‌పీహెచ్‌ఓ ఎం.రామానుజం, డాక్టర్లు కె.సుబ్బరాజు, కె.రవికుమార్, ఈఓ పీఆర్డీ కె.వెంకటేశ్వరరావు తదితరులు గ్రామంలో ఉండి పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య పరీక్షల్లో పాల్గొంటున్నారు.
Advertisement