సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డీఈఓ రమేశ్ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల మధ్య నె లకొన్న విభేదాలు కాస్తా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య చీలికకు దారితీశాయి. డీఈఓ కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. రెండు రోజుల క్రితం విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి డీఈఓ రమేశ్‌ను సెలవులో వెళ్లాలంటూ హెచ్చరికలు చేయటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. డీఈఓ బదిలీ విషయంలో విప్ జయప్రకాశ్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాలకు బాసటగా నిలుస్తుండగా మంత్రులు, ఎమ్మెల్యే డీఓఈ రమేశ్‌కు ‘‘మీరు ఏమి పట్టించుకోవద్దు.. పనిచేసుకోండి’’ అని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఇటీవల కొన్ని రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు, డీఈఓ రమేశ్‌కు మధ్య పొసగటం లేదు. డీఈఓ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగటంతోపాటు ఆందోళనకు సిద్ధమయ్యాయి. డీఈఓ అంశం ముదురిపాకాన పడటంతో కలెక్టర్ చొరవ తీసుకుని ఉపాధ్యాయ సంఘాలు, డీఈఓతో సమావేశం నిర్వహించే బాధ్యతను డీఆర్‌ఓకు అప్పగించారు. డీఆర్‌ఓ ప్రకాశ్‌కుమార్ డీఈఓ రమేశ్ సమక్షంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. అయినా డీఈఓ వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇటీవల విప్ జయప్రకాశ్‌రెడ్డిని కలిసి డీఈఓపై ఫిర్యాదు చేశారు.
దీనికితోడు వారం రోజుల క్రితం విప్ జయప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు డీఈఓపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రెండు రోజుల క్రితం విప్ జయప్రకాశ్‌రెడ్డి డీఈఓ రమేశ్‌కు ఫోన్ చేసి సెలవులో వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన డీఈఓ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విప్ జయప్రకాశ్‌రెడ్డి డీఈఓను హెచ్చరించినట్లు వార్తలు బయటకు పొక్కడంతో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు డీఈఓ రమేశ్‌కు సంఘీబావం ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని మంత్రులు డీఈఓకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఓ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకువేసి ‘‘మీరు వచ్చాకే ఉపాధ్యాయుల పనితీరులో మార్పువచ్చింది, ఎవరి బెదిరింపులకు లొంగాల్సిన పనిలేదు..మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి’’అంటూ బాసటగా నిలిచినట్లు తెలుస్తోంది.దీంతో అధికార పార్టీలో డీఈఓ అంశంపై రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఓవైపు విప్ జయప్రకాశ్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాలకు అండగా నిలుస్తుండగా మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు డీఈఓను సమర్థిస్తున్నారు. దీంతో విషయం కాస్తా రాజకీయరంగు పలుముకున్నట్లు కనిపిస్తోంది. డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఇప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనని అధికార పార్టీలో చర్చ సాగుతోంది.
డీఈఓ x ఉపాధ్యాయ సంఘాలు
Published Thu, Oct 10 2013 1:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement