- ఎన్నికలు లేకపోవడంతో ఆశావాదుల్లో నిర్లిప్తత
- విలీనంకాకున్నా ఎన్నికలు జరిగేవని ఆవేదన
- పంచాయతీలూ ఎన్నికలకు దూరమైన వైనం
- సార్వత్రిక ఎన్నికలకు ఓటరు నాడితెలిసే ఛాన్స్ పోయిందని కీలక నేతల మథనం
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఎన్నాళ్ల నుంచో వేచిన ఉదయం రానే వచ్చింది. కానీ అంచనాలే తారుమారయ్యాయి. అనుకున్నది ఒకటి... అయ్యిం ది ఒకటి అని అనకాపల్లి పట్టణ రాజకీయ పక్షాలు వాపోతున్నాయి. తొమ్మిదేళ్ల నుంచి స్థానిక ఎన్నికల కోసం ముఖం వాచిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలపై సాంకేతిక అవరోధాలు నీళ్లు చల్లాయి. ద్వితీయ శ్రేణి నాయకుల పదవీ కాంక్ష తీరేది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. సార్వత్రిక ఎన్నికల్లో వీరికి సేవ తప్ప దక్కేది ఏమీ ఉండదు.
2010 నుంచి మున్సిపల్ ఎన్నికల కోసం ఎదురు చూసిన రాజకీయ పక్షాలకు తాజా నోటిఫికేషన్ నిరాశే మిగిల్చింది. గ్రేటర్ ఎన్నికలు లేవనగానే వీరు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ప్రధాన పక్షాల కీలక నేతలకు కూడా కొంత ఈ నిర్ణయం నిరుత్సాహాన్ని మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు జనం పల్స్ తెలుసుకోవచ్చు అనుకున్న వారి ఆశలకు గండిపడింది. అనకాపల్లిపట్టణాన్ని గ్రేటర్ విశాఖలో విలీనం చేయడంతోనే ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకుల రాజకీయ భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి.
34 వార్డులతో ఉన్న అనకాపల్లి విలీనంతో 4 లేదా 5 కార్పొరేట్ స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. రాజకీయ నిరుద్యోగం పెరుగుతుందన్న భయంతోనే అప్పట్లో విలీనాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే విలీనం విషయంలో ప్రభుత్వం కొందరి వాదనకే ప్రాధాన్యం ఇవ్వడంతో వీరి చర్యలు ఫలించలేదు. విలీనం జరిగిపోవడంతో వీరంతా అప్పట్లో డీలాపడ్డారు.
కార్పొరేటర్లు అయ్యే అవకాశమైనా ఉందని కొందరు భావించారు. కానీ విలీనం జరిగి ఏడు నెలలైనా కనీసం వార్డుల పునర్విభజన కూడా జరగక పోవడంతో రాజకీయ నిరుద్యోగులను మరింత నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సంతోషించారు. అయితే గ్రేటర్ విశాఖ ఎన్నికలు వాయిదా పడటంతో పలువురు ఆశావాదులు నిట్టూరుస్తున్నారు. గ్రేటర్ విశాఖలో విలీనం కాకుంటే అనకాపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
రెంటికీ చెడిన పంచాయతీలు
పట్టణంలో పరిస్థితి ఇలా ఉంటే గ్రేటర్‌లో విలీనమైన రాజుపాలెం, వల్లూరు, కొప్పాక, తాడి, సాలాపువానిపాలెం పంచాయతీల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది. అటు పంచాయతీ పాలన లేక ఇటు వార్డుల పునర్విభజనలో స్పష్టత లేకపోవడంతో గ్రేటర్ ఎన్నికలు లేక ఆయా ప్రాంతాల్లో రాజకీయ పక్షాలు, ఆశావాదులు, ఎన్నికల ఔత్సాహికులు డీలాపడ్డారు.