వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి | Development of AP with decentralization | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి

Published Tue, Apr 3 2018 3:23 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

Development of AP with decentralization - Sakshi

కడప అగ్రికల్చర్‌: అభివృద్ధిని ఏదో ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే అనర్థాలు వస్తాయని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమలో హైకోర్టు’’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచినప్పుడు సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. పెద్ద పెద్ద సంస్థలు, ఆస్పత్రులు, రాజధాని, హైకోర్టు ఇలా అన్నీ హైదరాబాద్‌లో ఉంచడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కమిటీ రాజధాని కర్నూలులోను, హైకోర్టు గుంటూరులోను, రాయలసీమ జిల్లాల్లో ప్రాజెక్టులను నిర్మించాలని చెప్పిందని గుర్తు చేశారు.

విద్యా సంస్థలు, పరిపాలనా కేంద్రాలను పలు ప్రాంతాల్లో నెలకొల్పితేనే అభివృద్ధి సాధ్యమని శ్రీబాగ్‌ ఒడంబడిక చెబుతోందన్నారు. కానీ నేడు మళ్లీ ఇప్పటి పాలకులు అభివృద్ధిని ఒకేచోట నిక్షిప్తం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ ఏపీ అంతటా పర్యటించి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పిందని, రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట, రాష్ట్ర పరిపాలన కోసం జోనల్‌ కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారని కేంద్రానికి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే కేంద్రం ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం చర్యలు చేపట్టకుండా ఏపీ సర్కారుకు బాధ్యతలు అప్పగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో గానీ, మేధావులతో గానీ చర్చించకుండా ఏకపక్షంగా కొంతమంది వ్యాపార వేత్తలతో కూర్చొని ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరిస్తోందని మండిపడ్డారు.

ఇలా చేస్తే రాయ లసీమ సమితి తరçఫున మరో విభజన ఉద్యమానికి నాంది పలికినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని మొదట్లోనే హెచ్చరించామన్నారు. బీజేపీ నాయకులు ఇటీవల కర్నూలులో ఒక డిక్లరేషన్‌ విడుదల చేశారని, దాన్ని అమలు చేసేలా చర్యలు చేపడితే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని తెలిపారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒకేచోట అభివృద్ధిని ఎందుకు కేంద్రీకరణ చేస్తున్నారని ప్రశ్నించి, వివిధ ప్రాంతాల్లో పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించేలా చట్టం చేయాలని డిమాండ్‌ చేయాలన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం ప్రధాని స్థాయిలో హామీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌ తులసిరెడ్డి, రాయలసీమ కార్మిక,కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖరరెడ్డి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలి, జనచైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement