గుంతకల్లు, న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాయలసీమ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన నూతన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం అటకెక్కింది. ఇవి ఏళ్ల క్రితమే మంజూరైనా.. నిధులు విడుదల చేయడంలో రైల్వే శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నూతన రైలు మార్గాలతో పాటు రైలు మార్గాల సర్వేలు, గేజ్ మార్పిడి, డబ్లింగ్, విద్యుద్దీకరణ, ప్రయాణికులు, సిబ్బంది సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నింటిదీ ఇదే దుస్థితి. ఇప్పటికే పాలనాపరంగా, సాంకేతికంగా మంజూరైన పనులు చేపట్టాలంటే రూ.వేల కోట్లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. నిధుల గురించి ఎంపీలు పార్లమెంటులో కనీసం నోరు విప్పడం లేదు.
త్రిశంకు స్వర్గంలో నూతన రైలు మార్గాలు
మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేయించిన కడప - బెంగళూరు (వయా బంగారుపేట్) రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. 2008-09 బడ్జెట్‌లో మంజూరైన ఈ రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, రైల్వే శాఖ 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంది. కడప నుంచి కోలార్ వరకు రైలు మార్గం నిర్మాణానికి రూ.1,760 కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పట్లో సర్వే కోసం రూ.29 కోట్లు కేటాయించారు. అక్కడితో ప్రాజెక్టు ప్రగతి ఆగిపోయింది. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 308.7 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మించాలని భావించి 1997-98లోనే రైల్వే బోర్డు అనుమతులను మంజూరు చేసింది.
ఇందుకు రూ.539.80 కోట్లు అవసరమని అప్పట్లో అంచనా వేశారు. ఈ వ్యయం నేడు మూడింతలు పెరిగిందని రైల్వే ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గం నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తామని చెప్పినప్పటికీ రైల్వే శాఖ ముందుకు రావడం లేదు. దీంతో 2004-05 నుంచి వరుసగా అంచనా వ్యయాన్ని సవరించి పంపుతూనే ఉన్నారు. 1996-97లో మంజూరైన నంద్యాల - ఎర్రగుంట్ల మార్గానికి నిధుల కొరత వేధిస్తోంది.
దీనివల్ల ఈ మార్గంలోని బనగానపల్లి- నంద్యాల మధ్య పనులు పూర్తి కాలేదు. 1997-98 బడ్జెట్‌లో మహబూబ్‌నగర్ - మునీరాబాద్ మధ్య 246 కి.మీ మేర మంజూరైన రైలు మార్గం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మంత్రాలయం - కర్నూలు రోడ్డు (వయా ఎమ్మిగనూరు), పుట్టపర్తి-తిరుపతి(వయా కదిరి), గిద్దలూరు- భాక్రాపేట పనుల కోసం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. ఇక మార్కాపురం - శ్రీశైలం మధ్య 65 కిలోమీటర్ల రైలు మార్గానికి 2007లో సర్వే చేపట్టారు. సర్వే నివేదికను అదే ఏడాది నవంబరు 26న రైల్వే బోర్డుకు నివేదించారు. అయినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదు.
నత్తనడకన డబ్లింగ్,
విద్యుద్దీకరణ పనులు
ఓబుళవారిపల్లె -కృష్ణపట్నం పోర్టు మధ్య దాదాపు 114 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు నిధుల కొరతతో పడకేశాయి. వెంకటాచలం వరకు పనులు పూర్తి చేసి వదిలిపెట్టారు. సికింద్రాబాద్- బెంగళూరు ప్రధాన మార్గంలో సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు డబ్లింగ్ చేయాలని రైల్వే శాఖ భావించింది.
అయితే... 2006 ఫిబ్రవరిలో సర్వే చేసి చేతులు దులుపుకుంది. ఈ మార్గం డబ్లింగ్ కోసం రూ.534.32 కోట్లు అవసరం. ఇక ముంబయి - చెన్నై ప్రధాన మార్గంలోని రేణిగుంట - నందలూరు మధ్య 85 కి.మీ. విద్యుద్దీకరణ పనులను 2004 జూన్‌లో పూర్తి చేయాల్సి ఉండగా... అష్టకష్టాలు పడి గత ఏడాది పూర్తి చేశారు. నందలూరు - ముద్దనూరు మధ్య 55 కిలోమీటర్లు, ముద్దనూరు - కొండాపురం మధ్య 24 కి.మీ, కొండాపురం - గుంత కల్లు మధ్య 104 కి.మీ పనులు కూడా ఆ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యాయి. నందలూరు - వాడి మధ్య 451 కి.మీ. రైలు మార్గం విద్యుద్దీకరణకు రూ.1,200 కోట్లను కేటాయించారు. ఈ పనులు 2010 డిసెంబరు నాటికే పూర్తి కావాలి. అయితే.. నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముందుకు సాగని విద్యుత్తు లోకోషెడ్డు పనులు
రైల్వే డివిజన్ కేంద్రమైన గుంతకల్లులో రూ.74.3 కోట్లతో విద్యుత్తు లోకోషెడ్డును ఏర్పాటు చేసేందుకు డీటైల్డు రిపోర్టును రైల్వేబోర్డుకు పంపారు. వంద విద్యుత్తు లోకో ఇంజన్ల సామర్థ్యం గల ఈ షెడ్డులో 600 మందికి పైగా సిబ్బందిని నియమించే అవకాశముంది. దీన్ని 2012 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అంచనా వ్యయం కాస్తా రెటి ్టంపయ్యే అవకాశం ఉందని స్థానిక రైల్వే అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అటకెక్కిన రైల్వే ప్రాజెక్టులు
Published Mon, Feb 10 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement